AnaganagaReview: సుమంత్ ‘అనగనగా..’ రివ్యూ.. విద్యా వ్యవస్థలోని లోపాలు, తండ్రికొడుకుల మధ్య ఎమోషన్

AnaganagaReview: సుమంత్ ‘అనగనగా..’ రివ్యూ.. విద్యా వ్యవస్థలోని లోపాలు, తండ్రికొడుకుల మధ్య ఎమోషన్

సుమంత్ హీరోగా డైరెక్టర్ సన్నీ కుమార్ తెరకెక్కించిన మూవీ ‘అనగనగా..’(Anaganaga). తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్‌‌‌‌తో కలిసి కృషి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. నేడు ఈ మూవీ గురువారం (మే15న) ‘ఈటీవీ విన్‌’ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

చాలా కాలంగా పెద్ద హిట్ కొట్టని సుమంత్.. ఈసారి నేరుగా ఓటీటీలో తన సత్తా చూపించడానికి రెడీ అయ్యాడు. దాదాపు 25 సంవత్సరాలు సినిమా జర్నీ కంప్లీట్ చేసుకున్న సుమంత్.. ఈ ఓటీటీ మూవీతో ఎలాంటి హిట్ అందుకున్నాడు. స్కూల్ మాస్టారుగా సుమంత్ ఎలాంటి ప్రణాళికలు రచించాడు? అనగనగా కథ తెలియాలంటే రివ్యూ చూడాల్సిందే. 

కథేంటంటే:

వ్యాస్‌ (సుమంత్‌) ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ టీచర్‌. తనలోని భావాలు ఎప్పుడు పిల్లల భవిష్యత్తు వైపే ఉంటాయి. విద్యార్థులను సరైన క్రమపద్ధతిలో పెట్టాలంటే బెదిరించడం, భయపెట్టడం కాదని నమ్ముతాడు. మరి ముఖ్యంగా విద్యార్థుల బట్టీ చదువులకు వ్యాస్ మాస్టారు పూర్తి వ్యతిరేకం.
కార్పొరేట్ టీచర్స్ తమ స్టూడెంట్స్ ర్యాంకుల కోసం ఒత్తిడి తీసుకురావొద్దని నమ్ముతాడు.

అందుకు స్కూల్ మేనేజ్‌మెంట్‌తో వాదిస్తుంటాడు. అయిన అక్కడెవరు తన మాట వినరు. వ్యాస్‌ భార్య భాగ్య (కాజల్‌ చౌదరి) అదే స్కూల్‌కు ప్రిన్సిపల్. కానీ, తన భర్త మాటలను పట్టించుకోకుండా స్కూల్ మేనేజ్‌మెంట్‌ వైపే మాట్లాడుతుంటుంది. దానితోడు తరుచూ తన భర్త వ్యాస్పై కోప్పడుతుంది.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు ముదురుతాయి. వ్యాస్‌ మాటలను పెడచెవిన పెట్టిన స్కూల్ మేనేజ్‌మెంట్.. అతనిని జాబ్ నుండి తొలగిస్తుంది. కార్పొరేట్ స్కూల్లో ర్యాంకులు రావడానికి.. విద్యార్థులు కేవలం బట్టీ చదువులే చదవాలా... ఇంకెలాంటీ మార్గం లేదా? అని ఆలోచిస్తాడు. అందుకు ఆల్టర్‌ నేట్‌గా ఒక కీలకమైన మార్గాన్ని ఎంచుకుంటాడు వ్యాస్. 

ఈక్రమంలో కార్పొరేట్‌ స్కూల్‌కు ధీటుగా ఎలాంటి స్టెప్స్ వేశాడు? వ్యాస్కు ఎదురైన సవాళ్లు ఏంటి? వ్యాస్ ఎంచుకున్న మార్గంపై తన భార్య భాగ్యకు ఎలాంటి నిజాలు తెలిసొచ్చాయి? విద్యార్థులను టాపర్లుగా మలచడానికి వ్యాస్ మాస్టర్ చెప్పిన టిప్స్ ఏంటనేది మిగతా స్టోరీ. 

విశ్లేషణ:

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల చదువులపై ఓ సినిమా రావడం మెచ్చుకోదగిన విషయం. ఎన్నో అంశాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించిన మేకర్స్ ఆలోచన విధానాన్ని మెచ్చుకుని తీరాలి. ఒకప్పుడు పిల్లలకు 5 ఏళ్లు నిండితే తప్ప తల్లి తండ్రలు స్కూల్ లో చేర్పించేవారు కాదు. కానీ, ఇప్పుడు లేచి నిలబడితే చాలు పలక, బలపం పట్టిస్తున్నారు. అసలు పసితనమే అలవాటులేని పిల్లలను తమ  పేరెంట్స్ కార్పొరేట్ స్కూల్ లో చేర్పించి.. ఒక యుద్ధ వాతావరణాన్ని అందిస్తున్నారు. 

అక్కడ టీచర్స్ చెప్పేదేం అర్ధంగాక, అసలు ఏం చేయాలో తెలియక చిన్నపిల్లలు ఇబ్బందిపడుతున్నారు. రెండు, మూడు తరగతులకే పదోతరగతి సిలబస్ అర్ధం అయ్యేలా టీచర్స్ పాఠాలు.. ఇక పదోతరగతి రాకముందే జేఈఈ అడ్వాన్స్, ఐఐటీ కోచింగ్ అనేలా టార్గెట్ లు.. అందుకోసం విద్యార్థులకు బట్టి చదువులు. ఇదికాదు కాదా చదువు అంటే. పాఠాలను కథల రూపంలో చెప్పాలని, వారికి మరింత అర్థవంతంగా చెప్పాలని ఎంతమంది టీచర్స్  తపిస్తున్నారు ఆలోచించండి. అలాంటి ఆలోచన వచ్చింది ఓ యువ మాస్టరుకు. అతనే వ్యాస్. 

విద్యార్థులు తమ చదువును కొత్త పద్దతిలో నేర్చుకునేలా పాఠాలు చెప్పడానికి సుమంత్ తీసుకునే కీలక నిర్ణయాలే ఈ సినిమా. అందుకు ఓ మూడు టిప్స్ ను వారి ముందు ఉంచడం ప్రారంభిస్తాడు. అందులో "రోజులో పది గంటలు ఒత్తిడిలో చదవడం కంటే, 3 గంటలు ఒత్తిడి లేకుండా చదవండి. అలాగే, నడవండి.. ఓ ఆట ఆడండి.. ఒత్తిడి తగ్గించుకోండి. కేవలం మార్కుల కోసం చదవకండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. మార్కులు అవే వస్తాయి" అని సుమంత్ విద్యార్థులకు సూచించిన విధానం బాగుంది.

ఫెయిల్యూర్‌ విద్యార్థులుని తీసుకుని  వారందరికీ వ్యాస్‌ ట్యూషన్‌ చెప్పడం ఫైనల్‌ ఎగ్జామ్స్‌ లో వాళ్ళని టాపర్స్ ని నిలిచేలా చేయడం అందరినీ ఆలోచింపజేస్తాయి. ఇందులో మరి ముఖ్యంగా ఫాదర్-సన్ ఎమోషన్ ఆకట్టుకుంటోంది. నాని జెర్సీ మూవీ తర్వాత ఇంతలా తండ్రీ-కొడుకుల మధ్య భావోద్వేగాలతో వచ్చిన సినిమా ఇదే. వ్యాస్ తన కొడుకుకి నేర్పిన పాఠాలు, జీవిత సత్యాలు తెరపై ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి.

చివరలో వ్యాస్ కొడుకును ఇచ్చే ప్రసంగం కంటతడి పెట్టించేలా చేస్తోంది. అలాగే వ్యాస్ పిల్లలకు కథల రూపంలో పాఠాలు చెప్పాలన్న కాన్సెప్ట్‌ను ఎడ్యుకేషన్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడం, పిల్లల స్ట్రగుల్స్పై చర్చించడం బాగుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. విద్యావ్యవస్థ చూడాల్సిన, చదవాల్సిన పాఠం ‘అనగనగా.!

ఎవరెలా చేశారంటే:

హీరో సుమంత్ మాస్టరు వ్యాస్‌ పాత్రలో ఒదిగిపోయారు. విద్యార్థుల కోసం పాటుపడే మాస్టరుగా చక్కని ప్రదర్శన కనబరిచాడు. చాలా కాలం తర్వాత సుమంత్ కు దక్కిన మంచి పాత్రను తన భుజాలపై మోసుకెళ్లాడు. సుమంత్ కొడుకుగా నటించిన మాస్టర్‌ విహర్ష్‌ బాగా నటించాడు. క్లైమాక్స్ లో ప్రేక్షకుల్ని ఎమోషనల్ అయ్యేలా చేశాడు. సుమంత్ భార్యగా నటించిన కాజల్‌ చౌదరి ఆకట్టుకుంది. తన లుక్స్ మెస్మరైజ్ చేసింది. అలాగే భర్తపై విసుగుపడే భార్యగా నటించి మెప్పించింది. మిగతా పాత్రలు తమ పరిధి మేరకు నటించి న్యాయం చేశారు.