మే 2 నుంచి తెలుగు వర్సిటీలో.. సినీ నటన, లలిత కళల్లో సమ్మర్ క్లాసులు

మే 2 నుంచి తెలుగు వర్సిటీలో..  సినీ నటన, లలిత కళల్లో సమ్మర్ క్లాసులు
  •     సినీ నటన, లలిత కళల్లో 30 రోజుల స్పెషల్ ట్రైనింగ్ 

హైదరాబాద్, వెలుగు: వెండితెరపై మెరవాలని ఆశపడే యువతకు, కళలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ మంచి అవకాశం కల్పిస్తోంది. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సినీ నటనతోపాటు లలిత కళల్లో 30 రోజులపాటు వేసవి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

బాచుపల్లిలోని యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వర్సిటీలోని రంగస్థల కళల శాఖ లెక్చరర్ల పర్యవేక్షణలో సినీ నటన కోర్సు మే 2 నుంచి ప్రారంభంకానున్నట్లు వెల్లడించారు. అభినయ పాఠాలు, హావభావాలు, డైలాగ్ డెలివరీ, స్టేజ్ పెర్ఫార్మెన్స్, పాత్ర ఆవిష్కరణ, బాడీ లాంగ్వేజ్‌‌తోపాటు కెమెరా ముందు ఎలా ప్రవర్తించాలనే అంశాలపై నిపుణులు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారని పేర్కొన్నారు. 

లలిత కళల విభాగంలో పెయింటింగ్, శిల్పకళ, ప్రింట్‌‌ మేకింగ్ అంశాల్లో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. రేఖాచిత్రాలు, రంగుల వినియోగం, ఆకృతి నిర్మాణం, శిల్పరూపకల్పన, ముద్రణా కళలపై ప్రాథమిక, ప్రాయోగిక జ్ఞానాన్ని అందిస్తారని తెలిపారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సినీ నటన కోర్సుకు రూ.5 వేలు, ఫైన్ ఆర్ట్స్ కోర్సుకు రూ.3 వేలు ఫీజును నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. వివరాల కోసం 9346461733, 8301011865 నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.