ఎండాకాలంలో వీటిని తప్పక తినాల్సిందే

ఎండాకాలంలో వీటిని తప్పక తినాల్సిందే

హైదరాబాద్: రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. భానుడు మెళ్లిగా తన ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టాడు. ఇంకొన్ని రోజులైతే ఎండలు మరింతగా మండిపోవడం ఖాయం. కాబట్టి వేసవిలో తినే ఫుడ్ గురించి ఒకింత శ్రద్ధ తీసుకోవాల్సిందే. టెంపరేచర్ ఎక్కువగా ఉండే ఈ సీజన్‌‌లో ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరాన్ని చలువ ఉంచే కొన్ని ఫుడ్స్‌‌ను మన డైలీ మెనూలో చేర్చుకోవాల్సిందేనని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఆ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం..

పెరుగు: భారతీయుల సాంప్రదాయంగా కొన్ని వందల ఏళ్ల నుంచి పెరుగును తీసుకోవడం ఓ పద్ధతిగా ఇమిడిపోయింది. పొట్టకు పెరుగు తినడం చాలా మంచిది. రక్త ప్రసరణను నిలకడగా ఉంచడంతోపాటు వ్యాధి నిరోధకతను పెంచడం, జీర్ణశక్తిని మెరుగుపర్చడంలో పెరుగు ఇతోధికంగా ఉపయోగపడుతుంది. అన్నంలో నేరుగా కలుపుకొని పెరుగును తినొచ్చు లేదా రైతాగా చేసుకొని కూడా తినేయొచ్చు. 

పుదీనా: మన దేశంలో వేసవి కాలంలో ఆహారంలో ఎక్కువగా వినియోగించే వస్తువుగా పుదీనా చెప్పొచ్చు. చట్నీ, జ్యూస్‌‌లు, రైతాతోపాటు ఐస్ క్రీమ్ తయారీలో పుదీనాను వినియోగిస్తారు. పుదీనాకు ఉన్న తాజాదనం ఏ వంటకాన్నైనా ఫ్రెష్‌‌గా, టేస్టీగా మార్చేస్తుంది. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ చర్మాన్ని, జీర్ణశక్తి, వ్యాధి నిరోధకతను మెరుగుపర్చుతుంది.

దోసకాయ: దోసకాయను చాలా మంది లైట్ తీస్కుంటారు. కానీ సమ్మర్ హైడ్రేషన్‌‌ను తగ్గించడంలో ఈ కాయగూర చాలా దోహదపడుతుంది. మన శరీర ఉష్ణోగ్రతను స్థిరీకరించడంలో నీటి ఆవశ్యకత చాలా ఉంటుంది. ఇందులో చాలా మోతాదులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దోసకాయలో తక్కువ కెలోరీలు, జీర్ ఫ్యాట్ ఉంటుంది.

నిమ్మరసం: ఎండాకాలంలో నిమ్మరసానికి చాలా డిమాండ్ ఉంటుంది. కూల్ డ్రింక్స్‌ను పక్కనపెడితే సమ్మర్‌‌లో ఎక్కువగా గిరాకీ ఉండే బేవరేజెస్‌‌లో నిమ్మరసం ముందు వరుసలో ఉంటుంది. నిమ్మకాయల వల్ల శరీరానికి చలువదనం వస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడంలోనూ, జీవక్రియను వేగవంతం చేయడంలోనూ నిమ్మ కీలక పాత్ర వహిస్తుంది.