
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు వ్యక్తిగత నైపుణ్యాలకు సోపానాలుగా మారాయి. మేం పోము సర్కార్ బడులకు అనే రోజులుపోయి.. వేసవి సెలవుల్లో కూడా విద్యార్థులు ఆహ్లాదంగా ప్రభుత్వ బడుల్లోనే గడిపే రోజులు వచ్చాయి. విద్యార్థులకు ఉన్నతమైన చదువు, పౌష్టిక ఆహారం అందించడంతోపాటు నేడు ప్రభుత్వ పాఠశాలలు కళలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
ఒకప్పుడు బడి అంటే చదువు మాత్రమే. కానీ, నేడు చదువు ఒక్కటే కాదు వివిధ రకాల ఆటపాటలతో, కళలతో వేసవి సెలవుల్లో కూడా కళకళలాడుతున్నాయి మన ప్రభుత్వ పాఠశాలలు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో వేసవి సెలవులు వచ్చాయంటే అమ్మమ్మ ఇంటికో, నానమ్మ ఇంటికో వెళ్లేవాళ్లు. కొందరు అయితే వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తల్లిదండ్రులతోపాటు ఏ కూలి పనులకో వెళ్లేవాళ్ళు లేకపోలేదు. అయితే, ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇప్పించేవిధంగా, ఆ కళ వారికి ఆర్థికంగా ఉపయోగపడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా వేసవి శిక్షణ తరగతులను ప్రారంభించింది.
బాలికలకు కళల్లో శిక్షణ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రోజురోజుకూ చదువుల్లో ర్యాంకులు, మార్కులే ప్రాధాన్యంగా మారిపోయాయి. చిన్నారులు ఎక్కువ సమయం పుస్తకాలతోపాటు టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతుండటంతో వారిలో ఊహాశక్తి, సృజనాత్మకత తగ్గిపోతోంది. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులకు ఆటవిడుపుగా వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంప్‌ల ద్వారా ఎన్నో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని ప్రభుత్వ ఆలోచన. ఈక్రమంలో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచాలని ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలకు శ్రీకారం చుట్టింది. ఈ సమ్మర్ క్యాంప్‌ల్లో భాగంగా జనగామ జిల్లాలో కేజీబీవీ చౌడారంలో మే 5వ తేదీన ప్రారంభమైన వేసవి కాల శిబిరం 15 రోజుల పాటు జరుగుతుంది. 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న బాలికలు ఈ శిబిరంలో పాల్గొనడానికి అర్హులు.
ఇప్పటివరకు దాదాపు 56 మంది బాలికలు వివిధ కళల్లో శిక్షణ పొందుతున్నారు. 15 రోజులపాటు నృత్యం, సంగీతం, క్రీడలు, యోగా, స్పీడ్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ వంటి కార్యాచరణ శిక్షణ ఉంటుంది. నిపుణులైన సిబ్బందితో, సంరక్షకుల పర్యవేక్షణలో, స్నేహపూర్వక వాతావరణంలో క్యాంప్ నిర్వహణ జరుగుతోంది. క్యాంప్ కోఆర్డినేటర్స్గా రాణి, రజిత kgbv, ప్రత్యేక అధికారిణులుగా, క్యాంప్ లో ఎస్ఓలు, పీఈటీలు, సీఆర్టీలు, పీజీసీఆర్టీలు, నైట్ వాచ్ ఉమన్లు నైట్ డ్యూటీలో కూడా ఉంటారు. యంగ్ ఇండియా వేసవి శిబిరాలు విద్యార్థుల అంతర్గత సామర్థ్యాలను, సృజనాత్మకత నైపుణ్యాలను గుర్తించి వాటికి పదును పెట్టడమే లక్ష్యంగా తొలిసారిగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో యంగ్ ఇండియా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. అందుకనుగుణంగా ఈ నెల 8 వ తేదీ నుంచి జిల్లాలో 72 ఉన్నత, 9 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఈ క్యాంపులను నిర్వహిస్తున్నారు. 6 నుంచి 17 ఏళ్లలోపు ఉన్న బాలబాలికలు ఉదయం 8 గం.ల నుంచి 11 గం.ల వరకు ఇలా 15 రోజుల పాటు శిక్షణ తీసుకుంటారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయుడు ప్రతిరోజు ఈ శిబిరాలను
దగ్గరుండి పర్యవేక్షిస్తారు.
వివిధ అంశాలపై శిక్షణ
పిల్లల ఆసక్తికి అనుగుణంగా కుట్లు, అల్లికలు, ఇండోర్ గేమ్స్, బొమ్మలు తయారుచేయడం, చిత్ర లేఖనం, డ్యాన్స్, సంగీతం, డ్రమ్స్ వాయించడం, పాటలు పాడడం, ఏకపాత్రాభినయం, మిమిక్రీ, స్కిట్స్, మైమ్, యాంకరింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, వేదిక్ గణితం, మౌలిక కంప్యూటర్ పరిజ్ఞానం, కథలు చెప్పడం, రాయడం, చేతిరాత అభివృద్ధి పరుచుకోవడం, వ్యక్తిత్వ వికాసం, సైన్స్ ఎగ్జిబిట్స్ తయారుచేయడం, సామాజిక సేవ, తెలంగాణ సంప్రదాయ కళలపై శిక్షణ ఇవ్వనున్నారు. చివరి రోజు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను కూడా అందించనున్నారు. శిక్షణకి హాజరవుతున్న విద్యార్థులకు స్నాక్స్ కూడా అందిస్తున్నారు. వేసవి శిక్షణ తరగతులకు హాజరువుతున్న వారికోసం రిసోర్స్ పర్సన్లను నియమించారు. యోగా, స్పీడ్ మాథ్స్, పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ , డ్యాన్స్, మ్యూజిక్, కంప్యూటర్ స్కిల్స్, స్పోర్ట్స్ క్యాంప్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డినేటర్లకు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతున్నది.
బాలికలపై ప్రత్యేక శ్రద్ధ
బాలికల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం 100 మందికి జిల్లా విద్యాశాఖ నుంచి రూ.1,96,000 ఖర్చు చేస్తున్నారు. డే క్యాంప్ లో ఇద్దరు ట్రైనర్స్‌కి రూ.3000 చొప్పున, కుకింగ్, హెల్పర్‌కి రూ.1000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నారు. ఈ సందర్భంగా సమ్మర్ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న కేజీవీబీ జఫర్ఘడ్కు చెందిన మహాలక్ష్మి మాట్లాడుతూ..సమ్మర్ క్యాంపులో చాలా కళలను నేర్పిస్తున్నారు.. చాలా ఆసక్తిగా ఉంటున్నాయి. యోగా, డ్యాన్స్, స్పోకెన్ ఇంగ్లీష్, పాటలు పాడటం, కంప్యూటర్ స్కిల్స్ ఇలా చాలా నేర్పిస్తున్నారు. ఇవే కాకుండా ఇక్కడ పెడుతున్న ఫుడ్ కూడా చాలా బాగుందని తెలిపింది. మరో విద్యార్థిని జడ్పీస్ ఇటీకాలపల్లికి చెందిన శాహేద్ కూడా వేసవి శిబిరం గురించి చెపుతూ.. ఈ సమ్మర్ క్లాస్ లలో తాను డ్యాన్స్, చెస్, క్యారమ్స్ నేర్చుకుంటున్నాను అని, ప్రయివేట్‌గా డాన్స్ క్లాస్ కి పోవాలి అంటే ఎక్కువ ఫీజు అడిగారు. కానీ ఇక్కడ ఫ్రీగా నేర్చుకుంటున్నాం. మాకు చాలా ఉపయోగపడుతున్నాయి ఈ శిక్షణ తరగతులు. కొత్త దోస్తులు కూడా పరిచయమయ్యారని తెలిపింది. సర్కారు బడుల్లో సమ్మర్ క్యాంప్‌లపై బాలికల్లో పెరుగుతున్న ఆసక్తికి వీరే నిదర్శనం.
- బండి పల్లవి
డీపీఆర్ఓ, జనగామ