- మూడేండ్ల డిగ్రీకి 120, నాలుగేండ్లకు 160 క్రెడిట్లు
- కేయూకు సీపీజీఈటీ నిర్వహణ బాధ్యత
- ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్‌కు టీజీసీహెచ్ఈ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వచ్చే విద్యాసంవత్సరం (2026–-27) నుంచి డిగ్రీ, పీజీ కోర్సుల్లో కొత్త విధానం అమలు చేయాలని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్నది. శనివారం మాసబ్ ట్యాంక్ లోని టీజీసీహెచ్ఈ ఆఫీస్‌లో కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన యూనివర్సిటీ వీసీల సమావేశం జరిగింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో క్రెడిట్ సిస్టమ్ మార్పు, మల్టిపుల్ ఎంట్రీ-ఎగ్జిట్ విధానం, ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ వంటి అంశాలపై వీసీలు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
కొత్త క్రెడిట్ విధానం ఖరారు..
ఎన్‌ఈపీ నిబంధనల ప్రకారం కోర్సుల క్రెడిట్ నిర్మాణాన్ని టీజీసీహెచ్ఈ ఖరారు చేసింది. ఇకపై మూడేండ్ల సాధారణ డిగ్రీ పూర్తి చేయాలంటే కనీసం 120 క్రెడిట్లు సాధించాలి. నాలుగేండ్ల హానర్స్ లేదా రీసెర్చ్ డిగ్రీకి 160 క్రెడిట్లు, పీజీ కోర్సులకు కనీసం 80 క్రెడిట్లు ఉండాలని నిర్ణయించారు. వీటితోపాటు మైనర్ డిగ్రీలు, క్రెడిట్ బదిలీ, ఒక కోర్సు మధ్యలో ఆపేసి మళ్లీ చేరే (మల్టీపుల్ ఎంట్రీ ఎగ్జిట్) విధానంపై మార్గదర్శకాలు రూపొందించేందుకు వీసీలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
వర్సిటీలకు ఉమ్మడి క్యాలెండర్ : బాలకిష్టారెడ్డి
రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో ఒకేసారి తరగతులు, పరీక్షలు నిర్వహించేలా 2026-–27 విద్యాసంవత్సరానికి ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్ రూపొందించాలని సమావేశంలో నిర్ణయించినట్టు టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. దీనికోసం విద్యామండలితో వర్సిటీలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. విద్యాశాఖ జారీ చేసిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను వర్సిటీ స్థాయిలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు అమలు చేయాలని వీసీలను కోరారు.
ఈ మార్పుల వల్ల వర్సిటీలకు నాక్, ఎన్ఐఆర్ఎఫ్ వంటి జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానాలు లభిస్తాయన్నారు. జాతీయ స్థాయి పోటీ, పరిశోధన నిధులను ఆకర్షించడానికి ఎన్‌ఈపీ అమలు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. సిలబస్ రూపకల్పన, ఇంటర్న్‌షిప్స్, అప్రెంటిస్షిప్స్లో యూజీసీ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. అనంతరం కౌన్సిల్ న్యూస్ లెటర్ ను వీసీలతో కలిసి బాలకిష్టారెడ్డి రిలీజ్ చేశారు. ఈ సమావేశంలో మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇ.పురుషోత్తం, ప్రొఫెసర్ ఎస్ కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, వీసీలు కుమార్ మొలుగరం, ప్రతాప్ రెడ్డి, ఆల్తాఫ్ హుస్సేన్, ఉమేశ్ కుమార్, సూర్యధనుంజయ, యాదగిరిరావు, జీఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కేయూకు సీపీజీఈటీ బాధ్యతలు..
వచ్చే విద్యాసంవత్సరం (2026–-27) రాష్ట్రస్థాయి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్) నిర్వహణ బాధ్యతను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీకి కౌన్సిల్ అప్పగించింది. ఇప్పటిదాకా ఈ పరీక్షను ఓయూ నిర్వహించేది. ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల కోసం అవసరమైన సమయంలో ప్రత్యేక ప్రవేశ పరీక్ష పెట్టాలని నిర్ణయించారు. కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో డిగ్రీ, పీజీ కోర్సులను ప్రారంభించేందుకు వీసీలు ఒకే చెప్పారు.
