- ఎన్ఎంసీ కీలక ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుతున్న, పూర్తిచేసి వచ్చిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) మరోసారి స్పష్టతనిచ్చింది. కొవిడ్-19 మహమ్మారి, ఉక్రెయిన్–రష్యా యుద్ధ పరిస్థితుల కారణంగా ఆన్ లైన్ లో పాఠాలు విన్న విద్యార్థులు.. ఆ లోటును భర్తీ చేసేందుకు కచ్చితంగా ఫిజికల్ గా క్లాసులకు హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు(యూజీఎంఈబీ) శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది.
2021 నవంబర్ 18కి ముందు అడ్మిషన్ తీసుకున్నవారు, ఆ తర్వాత చేరిన వారు విదేశీ కాలేజీలోనే ఆఫ్ లైన్ పద్ధతిలో కవర్ చేయాల్సిందేనని, కేవలం ఆన్ లైన్ సర్టిఫికెట్ ఉంటే ఇండియాలో ఇంటర్న్ షిప్ కు, రిజిస్ట్రేషన్ కు పర్మిషన్ ఇవ్వమని స్పష్టం చేసింది.
ఎంతకాలం ఆన్‌లైన్ క్లాసులు వింటే అంతకాలం కోర్సు పొడిగింపు
ఎంతకాలం ఆన్‌లైన్ క్లాసులు జరిగాయో అంతకాలం కోర్సును పొడిగించి అక్కడే ఉండి థియరీ, ప్రాక్టికల్స్, క్లినికల్స్ పూర్తి చేయాలని, దీనికి సంబంధించి ఆయా యూనివర్సిటీలు ఇచ్చే కాంపెన్సేషన్ సర్టిఫికెట్లపై తప్పనిసరిగా భారత ఎంబసీ స్టాంప్, అథెంటికేషన్ ఉండాలని పేర్కొంది. ఈ సర్టిఫికెట్లను రాష్ట్ర మెడికల్ కౌన్సిళ్లు వెరిఫై చేశాకే ఇండియాలో ఇంటర్న్ షిప్ కు అర్హత సాధిస్తారని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.
విద్యార్థులు సమర్పించే డాక్యుమెంట్లు, పాస్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ రికార్డులు(ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు), వీసా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర మెడికల్ కౌన్సిళ్లదేనని పేర్కొంది. అన్నీ సక్రమంగా ఉంటేనే ప్రొవిజనల్, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది.
