
న్యూఢిల్లీ: పేగు వ్యాధికి చికిత్స చేయడానికి వాడే దాదాపు 55 వేల జనరిక్ మందుల బాటిళ్లను సన్ ఫార్మా అమెరికన్ మార్కెట్ నుంచి వెనక్కి రప్పిస్తోందని యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) తెలిపింది. న్యూజెర్సీకి చెందిన సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ , ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న డ్రగ్ మేజర్ యూనిట్, అమెరికన్ మార్కెట్లో 54,960 బాటిళ్ల మెసలమైన్ ఎక్స్టెండెడ్రిలీజ్ క్యాప్సూల్స్‌ను రీకాల్ చేస్తోంది.
మెసలమైన్ క్యాప్సూల్స్‌ను తేలికపాటి నుంచి మితమైన అల్సరేటివ్ కోల్టిస్ చికిత్స కోసం వాడుతారు. ఈ క్యాప్సూల్స్‌ను సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ దాని మొహాలీ ఆధారిత తయారీ ప్లాంట్‌లో తయారు చేసింది. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ద్వారా యూఎస్ మార్కెట్‌లో పంపిణీ చేసింది. కొన్ని లోపాల కారణంగా రీకాల్ జరుగుతోందని యూఎస్ఎఫ్డీఏ ప్రకారం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5న క్లాస్ 2 రీకాల్‌ను కంపెనీ ప్రారంభించింది. యూఎస్ జనరిక్ ఔషధాల మార్కెట్ విలువ 2019లో 115.2 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. సన్ ఫార్మా యూఎస్‌లోని ప్రముఖ జనరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటి.