కథల ఎంపికలో ఎప్పుడూ వైవిధ్యం చూపే హీరో నారా రోహిత్. కొంతకాలం విరామం తర్వాత 'ప్రతినిధి 2'తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. వినాయక చవితి సందర్భంగా 'సుందరకాండ' సినిమాతో అభిమానులను పలకరించారు. కొత్త దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్‌కుమార్, వృతి వాఘాని కథానాయికలు. ప్రమోషన్స్ తో మంచి ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..
కథేంటంటే?
సిద్ధార్థ్ (నారా రోహిత్) అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కథే ఈ సినిమా. వయసు 30 దాటినా పెళ్లి చేసుకోడు. దీనికి కారణం, తన స్కూల్ సీనియర్ వైష్ణవి (శ్రీదేవి)లో తను చూసిన ఐదు లక్షణాలు. అవే లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రూల్ పెట్టుకుంటాడు. కుటుంబం ఎన్ని సంబంధాలు తెచ్చినా, సిద్ధార్థ్ తన నిర్ణయాన్ని మార్చుకోడు. ఈ క్రమంలో, విదేశాలకు వెళ్తున్నప్పుడు ఎయిర్‌పోర్టులో ఐరా (వృతి వాఘాని)ను చూస్తాడు. ఆమెలో తనకి నచ్చిన లక్షణాలు కనిపించడంతో, ప్రయాణం రద్దు చేసుకొని ఆమెను ప్రేమలో పడేలా చేస్తాడు. కానీ, పెళ్లి గురించి మాట్లాడటానికి ఐరా ఇంటికి వెళ్ళినప్పుడు ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటి? సిద్ధార్థ్ మొదటి ప్రేమకథకు ముగింపు ఎలా పడింది? సిద్దార్థ్ చిన్నప్పుడు ఇష్టపడ్డ వైష్ణవి క్యారెక్టర్ ఈ కథలోకి మళ్లీ ఎందుకు ఎంటర్ అవుతుంది? ఐరాను అసలు పెళ్లి చేసుకుంటాడా.? అనేది మాత్రం వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..
ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ సరికొత్తగా..
ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ తెలుగులో కొత్త కాకపోయినా, ఈ సినిమాలో చూపించిన సున్నితమైన అంశం కొత్తగా అనిపిస్తుంది. దర్శకుడు ఈ కథను ఎక్కడా గీత దాటకుండా, హాస్యంతో కలిపి చూపించారు. 'సామజవరగమన' సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ లాంటిదే అయినా తెలుగు తెరపై ఇలాంటి పాయింట్‌తో వచ్చిన సినిమా ఇదే. సినిమా ఆద్యంతం హాస్యం ప్రధానంగా సాగుతుంది. ఫస్టాఫ్‌లో హీరో ప్రేమకథ, ఐరాతో లవ్ ట్రాక్.. ఇవన్నీ బోర్ కొట్టకుండా సాగుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది. కానీ, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతాయి. సత్య కామెడీ ట్రాక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అయితే, కథలో డ్రామాకి చాలా స్కోప్ ఉన్నా, దాన్ని దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. పాటలు, ఫైట్స్ కథలో అంతగా ఇమడలేదనిపిస్తుందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
నటీనటుల ప్రదర్శన
నారా రోహిత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కామెడీ, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. అయితే, డ్యాన్స్ సన్నివేశాల్లో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. చాన్నాళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి విజయ్‌కుమార్ తన పాత్రలో ఒదిగిపోయారు. ఆమె పాత్రకు మరిన్ని సీన్స్ ఉంటే బాగుండేదని అభిమానులు కోరుతున్నారు. వృతి వాఘాని తన నటనతో ఆకట్టుకుంది. సత్య, సునయన, సీనియర్ నరేశ్ తమ పాత్రల్లో మెప్పించారని ప్రేక్షకులు వెల్లడించారు.
సాంకేతిక అంశాలు
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. లియోన్ జేమ్స్ సంగీతం పర్వాలేదు. పాటలు వినడానికి బాగున్నాయి. దర్శకుడిగా వెంకటేశ్ నిమ్మలపూడి మొదటి సినిమా అయినా, కథను బాగానే ప్రెజెంట్ చేశారు. సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తానికి, 'సుందరకాండ' ఒక కొత్త పాయింట్‌తో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. పండగ రోజుల్లో కుటుంబంతో కలిసి చూడటానికి ఇది మంచి సినిమా. అయితే, కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, కొత్త కథాంశాన్ని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చవచ్చు.
