- భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే
- కాంగ్రెస్ నేతలు డ్రామా అంటున్నరు: కేటీఆర్
- ఒక ఆడబిడ్డ ఏడిస్తే ఇంత అన్యాయంగా మాట్లాడ్తరా?
- ఎన్నికలొస్తే ప్రజలను బెదిరిస్తున్నరు
- అన్నీ బంద్ పెడ్తమని సీఎం రేవంత్ అంటున్నడు.. రాజులా ఫీలైతున్నడు
- ఆడబిడ్డల ఆశీర్వాదంతో సునీత గెలుస్తారని ధీమా
హైదరాబాద్, వెలుగు: మాగంటి సునీతను కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని, ఆడబిడ్డను అవమానిస్తున్నవాళ్లకు బుద్ధిచెప్పాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘‘మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో చనిపోతే జూబ్లీహిల్స్‌కు ఎన్నికలు వచ్చినయ్. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సునీతకు కేసీఆర్ టికెట్ ఇచ్చిండు. భర్త చనిపోయి సునీత ఏడిస్తే.. దాన్ని కూడా కాంగ్రెస్ నేతలు డ్రామా అంటున్నరు.
ఒక ఆడబిడ్డ ఏడిస్తే ఇంత అన్యాయంగా మాట్లాడ్తరా? ఆడబిడ్డను అవమానిస్తున్నోళ్లకు బుద్ధి చెప్పాలి” అని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్లో -టీడీపీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్‌తోపాటు పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఎన్నికలొచ్చినప్పుడల్లా ప్రజలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
‘‘ఎన్నికలు వస్తుంటాయి..పోతుంటాయి. ఎన్నికలు వస్తే ఎవరైనా ప్రజలకు ఏం చేస్తారో చెప్తరు. కానీ, ఎవరైనా బెదిరిస్తరా? సీఎం రేవంత్ రెడ్డి అన్ని బంద్ చేస్తానని బెదిరిస్తున్నడు. రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలు. అది మర్చిపోయి రాజులా ఫీలైతున్నడు” అని దుయ్యబట్టారు. సీఎం కేవలం ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమేనని, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు.
రియల్ ఎస్టేట్‌ను నాశనం చేశారు
‘‘జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు రెడీగా ఉన్నరు. అసలు కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు ఓటేయాలి. రియల్ ఎస్టేట్‌ను నాశనం చేశారు. రెండేండ్లలో ఏం మంచిపని చేశారు? ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇండ్లు కూలగొడ్తున్నరు.
హైడ్రా, బుల్డోజర్ పేరుతో జులుం ప్రదర్శిస్తున్నరు” అని కేటీఆర్ దుయ్యబట్టారు. ‘‘కాంగ్రెస్ నేతలు 420 హామీలు ఇచ్చారు.. బీసీ, ఎస్సీ డిక్లరేషన్ అంటూ నోటికొచ్చిన హమీలు ఇచ్చారు. మా పార్టీ నుంచి గెలిచి మేయర్ అయిన వ్యక్తి ఇప్పుడు అధికార పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డే ఏ పనులు చేయట్లేదు.. ఇక, మేయర్ మనకు ఏం పనులు చేస్తరు.
ప్రజలు మాతోనే ఉన్నరు” అని తెలిపారు. జూబ్లీహిల్స్ విజయంతోనే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని, కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో మాగంటి సునీత ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఒక్క సీటు కోసం గల్లీ గల్లీ తిరుగుతున్నరు
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబితే.. ఆ పార్టీ నేతలకు హామీలు గుర్తుకొస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం రహమత్ నగర్ డివిజన్ లో రోడ్ షో నిర్వహించారు.
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఒక్క సీటు కూడా గెలవలేని కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. ఒక్క జూబ్లీహిల్స్ సీటు గెలవడం కోసం 14 మంది మంత్రులు, ఏకంగా ముఖ్యమంత్రి గల్లీ గల్లీలో తిరుగుతున్నరు” అని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఆయన అభివృద్ధి ఇంకా కండ్లముందే కనిపిస్తున్నదని తెలిపారు.
‘‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలందరికీ ఇండ్లు కట్టుకొమ్మని పట్టాలు అందజేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చి పేదల ఇండ్లను కూలగొడుతున్నది. జూబ్లీహిల్స్ లోని 4 లక్షల ఓటర్లు కాంగ్రెస్ కు బుద్ధి చెబితే రాష్ట్రంలో 4 కోట్ల ప్రజలకు మేలు జరుగుతుంది. రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి” అని పేర్కొన్నారు.
