అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో సునీతారెడ్డి పిటిషన్ 

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి.. సుప్రీంకోర్టులో సునీతారెడ్డి పిటిషన్ 

న్యూఢిల్లీ, వెలుగు: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కూతురు సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు మే 31న అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి హత్య కేసులో అవినాశ్ పై సీబీఐ కీలక అభియోగాలు మోపిందని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. వీటిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. దేశంలో సీబీఐ విచారిస్తోన్న ఏ కేసులోనూ ముందస్తు బెయిల్ ఇవ్వలేదని ప్రస్తావించారు. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు సంబంధించి హైకోర్టు తీర్పులో లోపాలున్నాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారించే అవకాశం ఉంది.