నాన్ లోకల్ అంటున్నోళ్లకు బుద్ధి చెప్పాలి: సునీతారెడ్డి

నాన్ లోకల్ అంటున్నోళ్లకు బుద్ధి చెప్పాలి: సునీతారెడ్డి

ఘట్ కేసర్, వెలుగు: తాను వ్యాపారాలు చేసుకునేందుకు, ఆస్తులు కూడబెట్టుకునేందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ప్రజాసేవ చేసేందుకు వచ్చానని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డి చెప్పారు. శుక్రవారం అన్నోజిగూడలో ఘట్ కేసర్, పోచారం మున్సిపాలిటీల్లోని కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. తాను జడ్పీ చైర్మన్​గా స్థానికంగా ఉంటూ.. 20 ఏండ్లుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు. తనని నాన్​లోకల్​అంటున్నవారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఇంటింటి వెళ్లి కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రచారం చేయాలన్నారు. పార్టీ గెలుపు కోసం కృషిచేసిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్​యాదవ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, బీ బ్లాక్ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, ఆయా మున్సిపాలిటీలు, మండల శాఖల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.