జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్.. బరిలో గోపీనాథ్ సతీమణి?

జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్.. బరిలో గోపీనాథ్ సతీమణి?
  • సునీతకే బీఆర్ఎస్ టికెట్?
  • టికెట్ ఆశించిన విష్ణువర్ధన్  రెడ్డి, పువ్వాడ
  • సునీత వైపే మొగ్గు చూపుతున్న గులాబీ పార్టీ
  • ఇవాళ డివిజన్ల వారీగా ఇన్ చార్జిలను ప్రకటించిన కేటీఆర్
  • ఇప్పటికే పలుమార్లు సర్వేలు నిర్వహించిన బీఆర్ఎస్ 

హైదరాబాద్: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత బరిలోకి దిగనున్నారు. ఆమె పేరును బీఆర్ఎస్ పార్టీ దాదాపు  ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే , దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్,  రావుల శ్రీధర్ రెడ్డి టికెట్ ఆశించారు.  ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ నేతృత్వంలో ఓ టీమ్ తో సర్వే చేయించారని సమాచారం. 

దీనిని అత్యంత పకడ్బందీగా నిర్వహించారని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే ప్రశ్న ఉన్నట్టు సమాచారం.  పలు సర్వేలను క్రోడీకరించుకొని సునీతకే చాన్స్ ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సానుభూతి సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని పార్టీ భావిస్తోందని పార్టీకి చెందిన ఓ కీలక నేత వెల్లడించారు.  ఇవాళ తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశానికి సునీతను ఆహ్వానించారు. 

ఆమె సమక్షంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ మీటింగ్ లోనూ మాజీ మంత్రి తలసాని ఇదే విషయాన్ని వెల్లడించారు. సునీత బరిలోకి దిగబోతున్నారని, ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.   

ఆరు డివిజన్లకు ఇన్ చార్జిల నియామకం

జూబ్లీ హిల్స్ సెగ్మెంట్  పరిధిలో ఆరు డివిజన్లున్నాయి. గులాబీ పార్టీ వాటికి ఇన్ చార్జిలను నియమించింది. రహమత్  నగర్ కు తక్కెళ్ల పల్లి రవీందర్ రావును, యూసూఫ్ గూడాకు పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి, బోరబండ కు వివేక్ గౌడ్ ను,  షేక్ పేటకు దాసోజు శ్రీవణ్​ ను, వెంగళరావు  నగర్ కు సుధీర  రెడ్డిని, ఎర్రగడ్డకు మాధవరం కృష్ణారావును నియమించారు. వీళ్లంతా సమిష్టిగా పార్టీ గెలుపుకోసం  కృషి చేయాలని సూచించడం గమనార్హం. 

►ALSO READ | ఆ మూడు కేసుల్లో.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఇప్పటికే కూతుళ్ల ప్రచారం

మాగంటి సునీతను గెలిపించాలని కోరుతూ ఆమె కూతుళ్లు మాగంటి అక్షర, మాగంటి దిశిర విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రహమత్ నగర్ డివిజన్ లో ఇంటింటికీ వెళ్లి తమ తల్లికి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తుండటం విశేషం.  ఇదే క్రమంలో సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతున్నారు.  

త్వరలో కేసీఆర్ అభ్యర్థిని ప్రకటిస్తారు: కేటీఆర్

జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది త్వరలోనే పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రకటిస్తారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ విజయానికి అంతా సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశానికి టికెట్ ఆశిస్తున్న వారిలో కేవలం మాగంటి సునీత మాత్రమే రావడం కొసమెరుపు.