
ఒకప్పుడు బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌లు అందుకున్న సన్నీడియోల్.. గత కొంతకాలంగా బాక్సాఫీస్ రేసులో వెనుకబడ్డారు. తనకు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌ను ఇచ్చిన ‘గదర్’కి సీక్వెల్‌గా ‘గదర్ 2’లో నటించిన ఆయన, ఈ సినిమాతో తిరిగి హిట్ కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. అనిల్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, సిమ్రత్ కౌర్, మనీష్ వాధ్వా, అర్జున్ ద్వివేది నటించారు. సోమవారం ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. 22 ఏళ్ల తర్వాత మరోసారి తారా సింగ్ పాత్రలో కనిపించారు సన్నీడియోల్.
‘అతను.. పాకిస్తాన్‌కి అల్లుడు, గ్రాండ్‌గా వెల్‌కమ్ చెబుదాం. లేదంటే ఈసారి అతను లాహోర్‌ను తీసుకెళ్తాడు’ అంటూ మహిళలు మాట్లాడుతున్న వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది. 1971లో జరిగిన ఇండో, పాక్ వార్ యుద్ధ సమయంలో, క్రష్ ఇండియా అనే పోస్టర్స్ అతికించడం, ఆ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది. బండి చక్రం తిప్పుతూ సన్నీడియోల్ చేసిన ఫైట్‌తో పాటు, శవాల మధ్య కూర్చుని బాధపడుతున్న ఎమోషనల్ సీన్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇటీవల రీ రిలీజ్ అయిన ‘గదర్’ సినిమా కూడా చక్కని వసూళ్లు రాబట్టడంతో.. సీక్వెల్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి. పంద్రాగస్టు సందర్భంగా ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది.