ఐపీఎల్ 19వ సీజన్‌కు మరికొన్ని గంటలే మిగిలుండగా చాలా మంది ఫోకస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ పైనే ఉంది. గత రెండు సీజన్లుగా విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లలో వణుకుపుట్టిస్తున్న సన్‌రైజర్స్ ఈసారి 300 రన్స్ మార్కు దాటడంతో పాటు పదేండ్లుగా తమను ఊరిస్తున్న రెండో ట్రోఫీని ముద్దాడాలని టార్గెట్‌గా పెట్టుకుంది. 2016లో కప్ నెగ్గిన ఆరెంజ్ ఆర్మీ ఆ తర్వాతా మెరుగ్గానే ఆడింది. ఈ క్రమంలో 2018, 2024లో ఫైనల్ చేరినా టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. ఈసారి ఎలాగైనా మరో టైటిల్ నెగ్గాలని చూస్తున్న రైజర్స్ బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. కానీ, రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లీగ్ తొలి సగానికి దూరం కానుండటం.. బౌలింగ్‌లో పసలేకపోవడం జట్టును కలవరపెడుతోంది.
బలాలు
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, లివింగ్‌స్టోన్.. ఈ పేర్లు వింటే ఎంత పెద్ద బౌలింగ్ అటాక్ అయినా భయపడుతుంది. ఓపెనింగ్‌లో అభిషేక్, హెడ్ క్రీజులో నిలబడితే పరుగుల సునామీ ఖాయం. 2024లో వీరిద్దరు కలిసి 691 రన్స్ జోడించి జట్టును ఫైనల్‌కు చేర్చారు. ఈసారి ఇషాన్ తాత్కాలిక కెప్టెన్‌గానూ కొత్త పాత్ర పోషిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో అదరగొట్టి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో 3 వేల రన్స్‌కు చేరువలో ఉన్న ఇషాన్ భుజాలపై జట్టు గెలుపు బాధ్యత ఎక్కువగా ఉంది. పవర్ బ్యాటింగ్‌కు మరో పేరు క్లాసెన్. 169.72 స్ట్రయిక్ రేట్‌తో 1480 రన్స్ చేసిన అతను ఎస్‌ఆర్‌హెచ్‌కు వెన్నెముకగా చెప్పొచ్చు. 166.19 స్ట్రయిక్ రేట్‌తో 236 రన్స్ చేసిన యంగ్ బ్యాటర్ అనికేత్ వర్మపై కూడా భారీ ఆశలు ఉన్నాయి. 2024లో ఎమర్జింగ్ ప్లేయర్‌గా నిలిచిన నితీశ్ రెడ్డి ఆల్‌రౌండ్ నైపుణ్యం జట్టుకు మరింత బలంగా మారనుంది. కొత్తగా వచ్చిన లివింగ్‌స్టోన్ కూడా బ్యాట్ ఝుళిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. గతేడాది టైటిల్ నెగ్గిన ఆర్సీబీ జట్టులో లివింగ్‌స్టోన్ సభ్యుడిగా ఉన్నాడు. ఓవరాల్‌గా ఈసారి 300 టార్గెట్‌ను నిర్దేశించేందుకు సన్ బ్యాటర్లు రెడీ అవుతున్నారు.
బలహీనతలు
బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో బౌలింగ్ అంత బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకుని వచ్చాడు. కాబట్టి కీలక టైమ్‌లో వికెట్లు తీసే అతని సామర్థ్యం, నైపుణ్యాన్ని తొలి అంచె పోటీల్లో ఎస్‌ఆర్‌హెచ్ కోల్పోతుంది. అదే టైమ్‌లో కమిన్స్‌కు సరైన ప్రత్యామ్నాయ బౌలర్ జట్టులో లేకపోవడం కూడా అతిపెద్ద సమస్య. స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ లక్నోకు వెళ్లిపోవడంతో పేస్ బాధ్యతలను ఎక్కువగా జైదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్ మోయాల్సి వస్తోంది. ఎనిమిది జట్ల తరఫున ఆడి 110 వికెట్లు తీసిన ఉనాద్కట్ అత్యంత అనుభవం ఉన్న బౌలర్. హర్షల్ వికెట్లు తీస్తున్నా రన్స్ కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నాడు. కమిన్స్ గైర్హాజరీలో బ్రైడన్ కార్స్, ఇషాన్ మలింగ అంచనాలను అందుకుంటే సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. కానీ వీరికి ఐపీఎల్ అనుభవం తక్కువ.. స్పిన్ విభాగంలో కమిందు మెండిస్, జీషన్ అన్సారీపైనే ఎక్కువ భారం పడనుంది. ఓవరాల్‌గా బ్యాటర్లు ఎంత దంచికొట్టినా.. బౌలర్లు కూడా మెప్పిస్తేనే ఆరెంజ్ ఆర్మీ మరోసారి ఐపీఎల్ బాద్‌షా అవుతుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు
ఇషాన్ కిషన్ (స్టాండిన్ కెప్టెన్), ప్యాట్ కమిన్స్, సలీల్ అరోరా, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఆర్. స్మరన్, అనికేత్ వర్మ, అభిషేక్ శర్మ, బ్రైడన్ కార్స్, హర్ష్ దూబే, క్రెయిన్ ఫులెట్రా, లివింగ్‌స్టోన్, కమిందు మెండిస్, నితీశ్ కుమార్, హర్షల్ పటేల్, శివమ్ మావి, శివాంగ్ కుమార్, అమిత్ కమార్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ, డేవిడ్ పైన్, షకీబ్ హసన్, ఓంకార్ తర్మాలే, జైదేవ్ ఉనాద్కట్, జీషాన్ అన్సారీ.
కమిన్స్ సేవలు సెకండాఫ్‌లోనే
వెన్ను గాయం నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ తాను ఐపీఎల్ ఫస్టాఫ్‌లో బరిలోకి దిగే చాన్స్ లేదని వెల్లడించాడు. టోర్నీ చివరి దశ కోసం తను రీ ఎంట్రీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పాడు. ‘నేను ఇంకా గాయం నుంచి కోలుకుంటున్నా. ప్రస్తుతం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నా. కాబట్టి ఫస్టాఫ్‌కు అందుబాటులో ఉండటం కష్టమే. ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి బౌలింగ్ చేస్తున్నా. టోర్నీ మధ్యలో పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తా. అంతా సవ్యంగా సాగితే సెకండాఫ్‌తో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు కూడా ఆడతా’ అని కమిన్స్ పేర్కొన్నాడు.
సన్ రైజర్స్ మ్యాచ్‌లు
తేదీ ప్రత్యర్థి వేదిక సమయం
మార్చి 28 ఆర్సీబీ బెంగళూరు రా. 7:30
ఏప్రిల్ 02 కేకేఆర్ కోల్‌కతా రా. 7:30
ఏప్రిల్ 05 లక్నో హైదరాబాద్ మ. 3:30
ఏప్రిల్ 11 పంజాబ్ న్యూ చండీగఢ్ మ. 3:30
ఏప్రిల్ 13 రాజస్తాన్ హైదరాబాద్ రా. 7:30
ఏప్రిల్ 18 సీఎస్కే హైదరాబాద్ రా 7:30
ఏప్రిల్ 21 ఢిల్లీ హైదరాబాద్ రా. 7:30
ఏప్రిల్ 25 రాజస్తాన్ జైపూర్ రా. 7:30
ఏప్రిల్ 29 ముంబై ముంబై రా. 7:30
మే 03 కేకేఆర్ హైదరాబాద్ మ. 3:30
మే 06 పంజాబ్ హైదరాబాద్ రా. 7:30
మే 12 గుజరాత్ అహ్మదాబాద్ రా. 7:30
మే 18 సీఎస్కే చెన్నై రా. 7:30
మే 22 ఆర్సీబీ హైదరాబాద్ రా. 7:30
