
దుబాయ్: సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. లాస్ట్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ఓటమి నుంచి వార్నర్‌సేన వెంటనే కోలుకుంది. గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో మెప్పించిన రైజర్స్ 8 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ను చిత్తుగా ఓడించింది. తొలుత రాజస్తాన్ 20 ఓవర్లలో 154/6 స్కోరు చేసింది. సంజూ శాంసన్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 36), బెన్ స్టోక్స్ (32 బంతుల్లో 2 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లు. అనంతరం మనీశ్ పాండే, విజయ్ మెరుపు బ్యాటింగ్‌తో హైదరాబాద్ 18.1.. ఓవర్లలో 156/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. పాండేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
బౌలర్లు సూపర్
రాజస్తాన్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. బెన్ స్టోక్స్, సంజూ శాంసన్ సెకండ్ వికెట్‌కు 56 రన్స్ జోడించినా వేగంగా ఆడలేకపోయారు. మిగతా బ్యాట్స్‌మెన్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీసిన సన్ రైజర్స్ బౌలర్లు రాజస్తాన్‌ను నిలువరించడంలో సక్సెస్ అయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన రాయల్స్ నాలుగో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఊపు మీద కనిపించిన ఓపెనర్ రాబిన్ ఊతప్ప (13 బంతుల్లో 19) పేలవ రీతిలో రనౌటవడంతో రైజర్స్‌కు బ్రేక్ లభించింది. హోల్డర్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టిన బెన్ స్టోక్స్ తర్వాత నెమ్మదించాడు. అయితే, వన్‌డౌన్ ప్లేయర్ సంజూ శాంసన్.. వచ్చీరాగానే సందీప్ శర్మ (0/31)బౌలింగ్‌లో వరుసగా రెండు బౌండ్రీలు రాబట్టడంతో ఐదు ఓవర్లకు రాయల్స్ 43/1తో నిలిచింది. కానీ, తర్వాతి మూడు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాకపోవడంతో రన్‌రేట్ తగ్గింది. పైగా, స్టోక్స్‌కు మరో లైఫ్ వచ్చింది. రషీద్ బౌలింగ్‌లో అతనిచ్చిన క్యాచ్‌ను డీప్ మిడ్ వికెట్‌లో విజయ్ శంకర్ డ్రాప్ చేశాడు. నటరాజన్ (0/46)ఓవర్లో ఓ ఫోర్ కొట్టిన శాంసన్ ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేయగా తొలి పదిలో రాయల్స్ 74/1 స్కోరు చేసింది. కాస్త స్లోగా ఆడుతున్నప్పటికీ స్టోక్స్, శాంసన్ ఇద్దరూ క్రీజులో కుదురుకోవడంతో ఆ జట్టు భారీ స్కోరుపై కన్నేసింది. కానీ, నాలుగు బంతుల తేడాతో ఈ ఇద్దరినీ ఔట్ చేసిన బౌలర్లు ప్రత్యర్థికి షాకిచ్చారు. ఫస్ట్ హోల్డర్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టిన శాంసన్ తర్వాతి బాల్‌కే లేట్ కట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్‌కే స్టోక్స్‌ను బౌల్డ్ చేసిన రషీద్ నాలుగే రన్స్ ఇచ్చాడు. బట్లర్ (9), స్మిత్ (19) ఇబ్బంది పడడంతో, 15 ఓవర్లకు గానీ స్కోరు వంద దాటలేదు. స్మిత్ రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చినా.. ఫామ్‌లో ఉన్న బట్లర్.. శంకర్ (1/15) బౌలింగ్‌లో నదీమ్ పట్టిన డైవింగ్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. దాంతో 17 ఓవర్లకు 118/4తో నిలిచిన రాయల్స్ 150 చేయడం కూడా కష్టమే అనిపించింది. కానీ, నటరాజన్ వేసిన తర్వాతి ఓవర్లో అద్భుత షాట్లతో అలరించిన యంగ్‌స్టర్ రియాన్ పరాగ్(20) వరుసగా 4,6,4 బాది ఇన్నింగ్స్‌కు మళ్లీ జోష్ తెచ్చాడు. అయితే,19వ ఓవర్లో స్మిత్, పరాగ్‌ను ఔట్ చేసిన హోల్డర్ ఏడే పరుగులిచ్చాడు. నటరాజన్ వేసిన లాస్ట్ ఓవర్లో 4, 6తో ఫినిషింగ్ టచ్ ఇచ్చిన ఆర్చర్ (16 నాటౌట్) స్కోరు 150 దాటించాడు.
విజయ్ నిలకడ.. పాండే ఫటాఫట్
చిన్న టార్గెట్ ఛేజింగ్‌ను సన్‌రైజర్స్ పేలవ రీతిలో ఆరంభించింది. మూడు ఓవర్లకే ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (4), జానీ బెయిర్‌సో (10) డగౌట్‌కు తిరిగొచ్చారు. కానీ, మనీశ్ పాండే, విజయ్ శంకర్ థర్డ్ వికెట్‌కు 140 రన్స్ జోడించి రైజర్స్‌ను గెలిపించారు. ఫస్ట్ స్పెల్‌లో ఆర్చర్ (2/21) హడలెత్తించాడు. ఇన్నింగ్స్ నాలుగో బాల్‌కే వార్నర్‌ను ఔట్ చేశాడు. రాజ్‌పుత్ (0/11)బౌలింగ్‌లో 4, 6 కొట్టిన బెయిర్‌స్టోను థర్డ్ ఓవర్లో అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేసిన ఆర్చర్ రైజర్స్‌కు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. 16/2తో కష్టాల్లో పడ్డ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత మనీశ్, విజయ్‌పై పడింది. శంకర్ తొలుత వికెట్ కాపాడుకోవడానికే పరిమితమైనా.. పాండే మాత్రం ఎదురుదాడికి దిగాడు. కార్తీక్ త్యాగి (0/42)వేసిన నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, స్టోక్స్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లతో చెలరేగాడు. త్యాగి బౌలింగ్‌లోనే 4, 6, 6 తో రెచ్చిపోవడంతో పవర్ ప్లేలోనే 58 రన్స్ వచ్చాయి. దాంతో, రాయల్స్ కెప్టెన్ స్మిత్ రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లు శ్రేయస్ గోపాల్ (0/32), తెవాటియా (0/25)ను బరిలోకి దింపాడు. వీరి రాకతో కాస్త నెమ్మదించిన మనీశ్.. తొమ్మిదో ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్‌తో మళ్లీ జోరు పెంచాడు. 28 బాల్స్‌లోనే ఫిఫ్టీ కంప్లీట్ చేసుకున్నాడు. మరో ఎండ్‌లో శ్రేయస్ వేసిన 11వ ఓవర్లో వరుసగా రెండు బౌండ్రీలతో విజయ్ కూడా గేరు మార్చాడు. దాంతో, 12 ఓవర్లోనే స్కోరు వంద దాటడంతో మ్యాచ్ రైజర్స్ చేతుల్లోకి వచ్చేసింది. తెవాటియా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన పాండే తర్వాత కాస్త స్లో అయినా.. ఆర్చర్ స్పెల్ లాస్ట్ ఓవర్లో శంకర్ హ్యాట్రిక్ ఫోర్లతో రెచ్చిపోయాడు. త్యాగి, స్టోక్స్ ఓవర్లలో పాండే ఒక్కో సిక్సర్ కొట్టి టార్గెట్‌ను చేరువ చేశాడు. త్యాగి బౌలింగ్‌లో బౌండ్రీతో మ్యాచ్‌ను ఫినిష్ చేసిన శంకర్ ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకున్నాడు.
రాజస్తాన్: ఊతప్ప (రనౌట్/హోల్డర్) 19, బెన్ స్టోక్స్ (బి) రషీద్ ఖాన్ 30, శాంసన్ (బి) హోల్డర్ 36, బట్లర్ (సి) నదీమ్ (బి) శంకర్ 9, స్మిత్ (సి) పాండే (బి) హోల్డర్ 19, పరాగ్ (సి) వార్నర్ (బి) హోల్డర్ 20, తెవాటియా (నాటౌట్) 2, జోఫ్రా ఆర్చర్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 154/6; వికెట్ల పతనం: 1–30, 2–86, 3–86, 4–110, 5–134, 6–135; బౌలింగ్: సందీప్ 4–0–31–0, హోల్డర్ 4–0–33–3, శంకర్ 3–0–15–1, నటరాజన్ 4–0–46–0, రషీద్ 4–0–20–1, నదీమ్ 1–0–9–0.
హైదరాబాద్: వార్నర్ (సి) స్టోక్స్ (బి) ఆర్చర్ 4, బెయిర్ స్టో (బి) ఆర్చర్10, పాండే (నాటౌట్) 83, శంకర్(నాటౌట్) 52; ఎక్స్‌ట్రాలు:7; మొత్తం: 18.1 ఓవర్లలో 156/2; వికెట్ల పతనం: 1–4, 2–16; బౌలింగ్: ఆర్చర్ 4–0–21–2, రాజ్‌పుత్ 1–0–11–0, త్యాగి 3.1–0–42–0, స్టోక్స్ 2–0–24–0, గోపాల్ 4–0–32–0, తెవాటియా 4–0–25–0.