
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యానారాయణస్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతీ ఏడాది మార్చి 9,10 తేదీల్లో అదే విధంగా అక్టోబర్ 1,2 తేదీల్లో సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకుతుంటాయి. సూర్యకిరణాలు ఆలయ పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి స్వామివారి పాదాలను తాకుతాయి. ఈ అద్భుత దృశ్యం కేవలం 3,4 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఈఏడాది కూడా కిరణాలు తాకుతాయని భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారు. అయితే ఇవాళ సూర్య కిరణాలు పడకుండా మేఘాలు అడ్డుపడడంతో అవి పాదాలను తాకలేదు. దీంతో సూర్య కిరణాలు పాదాలను తాకే దృశ్యాన్ని చూసేందుకు వచ్చే భక్తులు నిరాశతో వెనుదిరిగారు. రేపు (ఆదివారం) స్వామి వారి మూలవిరాట్‌ను సూర్య కిరణాలు తాకే అవకాశం ఉందంటున్నారు ఆలయ అర్చకులు.