
దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని మే 31న రీరిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు తెలిపారు. కృష్ణ అభిమానుల కోరిక మేరకే ఈ మూవీని మళ్ళీ థియేటర్ లలోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. 1971 లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇండియాస్ ఫస్ట్ కౌబాయ్ చిత్రంగా ప్రేక్షకులను అలరించిందని, అంతేకాకుండా ఇదే ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ అని ఆయన తెలిపారు. ఇండియన్ మూవీ ఇండస్ట్రీకి టెక్నాలజీ అందించిన గొప్ప హీరో కృష్ణ అని ఆయన కొనియాడారు.
హీరో కృష్ణ పేరుమీద ఆయన స్వగ్రామమైన బుర్రిపాలెంలో ఓల్డేజ్ హోమ్ నిర్మిస్తున్నామని ఆదిశేషగిరిరావు ఈ సందర్భంగా తెలిపారు. కృష్ణకు ఎలాంటి కోరికలు లేవని, ఏ అవార్డ్ లపై ఆయనకు ఆసక్తి ఉండేది కాదని చెప్పారు. ఈ రోజుల్లో ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవాళ్లకే అవార్డ్స్ ఇస్తున్నారని ఆదిశేషగిరిరావు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక ఫిల్మ్ ఇండస్ట్రీని, నంది అవార్డ్స్ ని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో మోసగాళ్లకు మోసగాడు ఒకటి. ఈ చిత్రం ఆయనకు మంచిపేరును తీసుకువచ్చింది. కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయనిర్మల, నాగభూషణం, రావుగోపాలరావు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి మొదట "అదృష్టరేఖ" అన్న టైటిల్ ను పెడదామని అనుకున్నారు కానీ చివరకు మోసగాళ్ళకు మోసగాడు అని ఫైనల్ చేశారు. దాదాపు 52 సంవత్సరాల తరువాత ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయబోతున్నారు.