సీరియస్​ అయ్యాక  గాంధీకి.. అందుకే డెత్స్ ఎక్కువ

సీరియస్​ అయ్యాక  గాంధీకి.. అందుకే డెత్స్ ఎక్కువ


పద్మారావునగర్, వెలుగు:  కరోనా ఇన్​ఫెక్షన్ లోడ్ బాడీలో విపరీతంగా పెరిగాక వేరే ఆస్పత్రుల నుంచి చివరి నిమిషంలో పేషెంట్లు గాంధీ హాస్పిటల్​కు వస్తున్నారని, దాంతో ఇక్కడ డెత్ రేట్ ఎక్కువగా కనిపిస్తోందని సూపరింటెండెంట్ ప్రొ. రాజారావు చెప్పారు. పరిస్థితి చేయి దాటాక వస్తున్నా పేషెంట్ల ప్రాణాలను కాపాడాటానికి నిపుణులతో కూడిన గాంధీ మెడికల్ టీమ్ రౌండ్ ఏ క్లాక్ పని చేస్తోందని, రోజూ వంద వరకు పాజిటివ్ పేషెంట్లు పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్​ అవుతున్నారని తెలిపారు. శుక్రవారం ఆయన గాంధీ గేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం గాంధీలో బెడ్స్ పూర్తిగా నిండినది వాస్తవమేనని, అయినా ఎవరినీ తిప్పి పంపడం లేదని, రోజూ 100 లోపు డెత్స్, 100 వరకు డిశ్చార్జ్​లతో ఖాళీ అవుతున్న బెడ్లను కొత్త పేషెంట్లకు కేటాయిస్తున్నామని వెల్లడించారు. బెడ్స్​ కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోడానికి స్పెషల్ టీమ్ మానిటర్ చేస్తోందన్నారు. గాంధీలో మొత్తం 650 వెంటిలేటర్ బెడ్స్, 600 ఆక్సిజన్ బెడ్స్, మరో 600 వరకు జనరల్ బెడ్స్ ఉన్నాయన్నారు. గతేడాది లో పోల్చితే సెకండ్​వేవ్​లో యంగస్టర్స్ ఎక్కువగా వైరస్ బారిన పడడానికి కారణం కరోనా రూల్స్​ పాటించకపోవడమేనన్నారు. 

బ్లాక్​ ఫంగస్​కు మందుల కొరత ఉంది

బ్లాక్ ఫంగస్ కేసులు గాంధీలో ప్రస్తుతం మూడున్నాయని, వీళ్లు వేరే ఆస్పత్రుల నుంచి రెఫరల్​గా వచ్చిన వారని రాజారావు చెప్పారు. ఇందులో ఒకరు నిజామాబాద్, ఒకరు ఆదిలాబాద్, మరొకరు హైదరాబాద్ వారని తెలిపారు. ఒకరికి బ్లాక్ ఫంగస్ బ్రెయిన్ లో, మరొకరికి సైనస్​లో ఉండగా, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఇంకొకరికి మైల్డ్ లక్షణాలున్నాయని చెప్పారు. వీరికి ప్రత్యేక మెడికల్ టీమ్ ట్రీట్​మెంట్​చేస్తోందన్నారు. ఈ ఫంగస్​ను గతేడాది కూడా కొందరిలో గమనించామని, ఆ ఇన్​ఫెక్షన్​ను తొలగించడానికి ట్రీట్​మెంట్ చేశామని చెప్పారు. ఇప్పుడిది బాగా వ్యాపిస్తోందని, డయాబెటిస్ పేషెంట్లు, కరోనా సోకిన వారు, నయమైన వారిలోనూ కనిపిస్తోందని అన్నారు. ఇన్ ఫెక్షన్ కంటిచూపుపై దాడి చేస్తుందని, దీనికి మందుల కొరత ఉందన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత జ్వరం వస్తే బ్లాక్ ఫంగస్​గా అనుమానించాల్సి ఉంటుందని చెప్పారు.