టాలివుడ్ కా సర్కాతాజ్ హీరో కృష్ణ

 టాలివుడ్ కా సర్కాతాజ్ హీరో కృష్ణ

ఖులా దిల్, ఔర్ ఖులే హాత్ వాలా, టాలివుడ్ కా సర్కాతాజ్ హీరో కృష్ణ వెళ్లి పోయిండు. సౌత్ ఇండియాకు నూతన టెక్నాలజీని పరిచయం చేసిన, హాలివుడ్ తర్వాత దేశంలోనే మొట్ట మొదటి జేమ్స్ బాండ్, గూడచారి116 వంటి చిత్రాలతో అలరించిన హీరో కృష్ణ తన 80వ ఏట తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమాను టెక్నాలజీ వాడకంలో ఆకాశం అంత ఎత్తుకు తీసుకు వెళ్లిన ఘనత ఆయన సొంతం. తనకంటే సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్ చేయలేని ధైర్య సాహసాలను చేశారాయన. అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా సినిమా స్కోప్ ను, సింహాసనం సినిమాతో 70 ఎంఎం సినిమా టెక్నాలజీ తీసుకొచ్చారు. డీటీఎస్, ఈస్ట్ మన్ కలర్ చిత్రాన్ని కూడా ఆయనే పరిచయం చేశారు. తెలుగు సినిమా రంగానికి మోసగాళ్లకు మోసగాడు చిత్రం ద్వారా కౌబాయ్ చిత్రాలకు ఆద్యుడయ్యాడు. ఇంగ్లీష్​ డబ్బింగ్​ ద్వారా హాలీవుడ్​కు కూడా ఈ చిత్రం వెళ్లింది. దాదాపు15 భాషల్లో దీన్ని డబ్ చేసినట్లు అంచనా. పద్మ భూషణ్ లాంటి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న కృష్ణ 350కి పైగా చిత్రాల్లో నటించారు. మల్టీ స్టారర్ చిత్రాలను నిర్మించి శోభన్ బాబు, ఎన్టీఆర్, కృష్ణంరాజు, ఏఎన్నార్ లాంటి వారితో నటించారు. ఒక ఏడాది కృష్ణవి18 చిత్రాలు విడుదలయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు నటించిన మలయాళం నటుడు  ప్రేమ్ నజీర్ కూడా ఒక ఏడాదిలో కృష్ణ నటించిన అన్ని చిత్రాలు నటించలేదని అంటారు.

రాజీవ్​గాంధీ ప్రోద్భలంతో రాజకీయాల్లోకి
ఉన్నతమైన వ్యక్తిత్వం గల మంచి మనిషిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కృష్ణ తాను నటించిన చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వ్యాపారం లేక నిర్మాత నష్ట పోయినపుడు మద్దతుగా నిలిచేవారు. పలువురు నిర్మాతలు తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకున్నా అడిగే వారు కాదట. ఇలా ఆయన చాలా మందికి హెల్ప్ చేసే వారు. ఒకానొక తరుణంలో తాను చాలా లాస్​లో ఉన్న సందర్భంలోనూ ఎవరినీ ఒక్క పైసా అడగలేదట. ఆయన సినిమాల్లోకి రావడానికి ఎన్టీఆర్ స్ఫూర్తి అయితే, రాజకీయాల్లోకి రావడానికి దివంగత మాజీ పీఎం రాజీవ్ గాంధీ ప్రోద్భలం ఉందనే వారు కృష్ణ. ఏలూరు ఎంపీ స్థానంలో కాంగ్రెస్  నుంచి పోటీ చేసి1989 లో ఎంపీగా గెలిచారు. కృష్ణ చాలా చిత్రాలకు డైరెక్టర్ గా కూడా పని చేశారు. ఏఎన్నార్ నటించిన ఫేమస్ చిత్రం దేవదాస్ ను తాను నటిస్తూ రీమేక్ చేశారు కృష్ణ. విజయానికి గర్వపడటం, అపజయానికి కుంగిపోవడం ఆయనకు తెలియవు. ఎప్పుడూ ఒకేలా, ఒక నిండు మనిషిగా తనకు తోచిన విధంగా సాయం అందించే మనస్తత్వం, గుణం ఉన్న కృష్ణకు నేనూ అభిమానినే. ఈనాడు, మోసగాళ్లకు మోసగాడు, మంచి వాళ్లకు మంచి వాడు, పాడి పంటలు, గూడు పుఠాణి, పండంటి కాపురం, అవే కళ్లు, అల్లూరి సీతారామరాజు, మండే గుండెలు, ఏజెంట్ గోపి, దేవదాస్ లాంటి చిత్రాలు నా ఫేవరెట్ చిత్రాలు. కృష్ణ సినిమా అనగానే మినిమం గ్యారంటీ, బాక్స్ ఆఫీస్ వద్ద పైసా వసూల్ చిత్రంగా ఉండేది. కృష్ణకు 2500 అభిమాన సంఘాలు ఉండేవట, ఆయన తన ప్రతీ పుట్టిన రోజు ఊటీలో జరుపుకునే వారు, ఒకసారి ఆయనను మేము కుటుంబంతో పాటు ఊటీ వెళ్లినపుడు, కారులో ఆయన వస్తుండగా చూశాం. కృష్ణ లాంటి మనుషులు అరుదు. ఆయనకు హృదయ పూర్వక నివాళులు.  

-ఎండీ మునీర్,సీనియర్ జర్నలిస్ట్