
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా మరో రెండు కొత్త సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాలు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్నాయి. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఆ సంస్థ హెడ్ తమిళకుమారన్ దీనిపై స్పందించారు. రజనీతో తాము రెండు సినిమాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ చిత్రాల ప్రారంభోత్సవం నవంబర్ 5న చెన్నైలో జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రజనీకాంత్ రోబో 2.0 చిత్రంలో నటించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడదే బ్యానర్ లో రజనీ మరోసారి నటించడం విశేషం. ఈ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు.
లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే 'పొన్నియిన్ సెల్వన్' చిత్రాన్ని నిర్మించారు. దీంతో పాటు పొన్నియిన్ సెల్వన్ 2, భారతీయుడు 2 సినిమాలు కూడా ఈ బ్యానర్లోనే రానున్నాయి. ఇక రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు నెల్సన్ కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత లైకా ప్రొడక్షన్స్ లో రెండు సినిమాలను రజనీ చేయనున్నట్లు సమాచారం.