అక్రమార్కుల చేతుల్లోకే చేసే చేపపిల్లల సప్లై కాంట్రాక్ట్‌.. !

అక్రమార్కుల చేతుల్లోకే చేసే చేపపిల్లల సప్లై కాంట్రాక్ట్‌.. !
  • ఫామ్‌ లేకుండానే బినామీ పేర్లతో టెండర్లు వేసిన అధికార పార్టీ లీడర్లు
  • ఆరేళ్లుగా ఇద్దరు లీడర్లకే కాంట్రాక్ట్‌ అప్పగిస్తున్న ఆఫీసర్లు
  • పిల్లల పంపిణీలో గతంలో భారీ అక్రమాలు

సూర్యాపేట, వెలుగు : మత్స్యకారులకు ప్రభుత్వం ఫ్రీగా పంపిణీ చేసే చేపపిల్లల సప్లై కాంట్రాక్ట్‌ సూర్యాపేట జిల్లాలో ప్రతి సంవత్సరం అక్రమార్కుల చేతుల్లోకే వెళ్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులే బినామీ పేర్లతో టెండర్లు వేస్తూ, ఆఫీసర్లను మేనేజ్‌ చేస్తూ ఆరేళ్లుగా కాంట్రాక్ట్‌ దక్కించుకుంటున్నారని తెలుస్తోంది. చేప పిల్లలను పెంచే ఫామ్‌హౌజ్‌లు లేకున్నా ఉన్నట్లు చూపుతూ, పిల్లల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. 

ఈ సారి టార్గెట్‌ 3.60 కోట్ల చేప పిల్లలు

రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా 2022 – 23 సంవత్సరానికి సూర్యాపేట జిల్లాలో 3.60 కోట్ల పిల్లలు పంపిణీ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. జిల్లాలో మొత్తం 850 చెరువులతో పాటు మూసీ, పులిచింతల రిజర్వాయర్లు ఉన్నాయి. వీటిపై 139 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, 3 మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల్లో 15,736 మంది మత్స్యకారులు ఉన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో పోసేందుకు 80 మిల్లీమీటర్ల నుంచి 100, చెరువులు, కుంటల్లో పోసేందుకు 35 నుంచి 40 మిల్లీమీటర్ల సైజ్‌ గల చేప పిల్లలను సరఫరా చేయాల్సి ఉంటుంది. చెరువులు, రిజర్వాయర్లలో జులైలో చేప పిల్లలను పోయాల్సి ఉండడంతో మే నుంచే ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది. 

బినామీ పేర్లతో లీడర్ల టెండర్లు 

అధికార పార్టీకి చెందిన ఇద్దరు లీడర్లే ప్రతి సంవత్సరం బినామీల పేర్లతో చేప పిల్లల సరఫరా కోసం టెండర్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి సొంతంగా ఫామ్‌హౌజ్ లేకున్నా మత్స్యశాఖ ఆఫీసర్లతో చేతులు కలిపి ఈ సారి కూడా టెండర్లు వేసినట్లు సమాచారం. ఈ సంవత్సరం చేప పిల్లల సరఫరాకు మొత్తం 9 టెండర్లు వచ్చాయని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం కూడా ఆ ఇద్దరికే కాంట్రాక్ట్‌ కట్టబెట్టేలా ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పిల్లలు పోయకుండానే పోసినట్లు బిల్లులు

గతంలో చేప పిల్లలు పోయడం ఆలస్యం కావడంతో మత్స్యకారులే సొంతంగా కొనుక్కొని చెరువులో పోసుకున్నారు. తర్వాత తుంగతుర్తి నియోజకవర్గం జాజిరెడ్డి గూడెంలోని ఓ గ్రామ చెరువులో తక్కువ సైజ్‌ ఉన్న  సైజ్ ఉన్న చేప పిల్లలను పోసేందుకు కాంట్రాక్టర్‌ ప్రయత్నించడంతో మత్స్యకారులు అడ్డుకున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ పిల్లలు పోయకుండానే పోసినట్లు బిల్లులు చూపి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న మత్స్యకారులు విషయాన్ని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లడంతో ‘చూసీ చూడనట్లుగా వదిలేయండి’ అని ఆ ఆఫీసర్‌ సమాధానం ఇచ్చారని మత్స్యకారులు తెలిపారు. ఇలా జిల్లాలోని చాలా చెరువుల్లో పిల్లలు పోయకుండానే పోసినట్లు బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి బినామీలకు టెండర్లు కేటాయించకుండా చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు.

మా దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం

చేప పిల్లల పంపిణీకి సంబందించి 9 మంది టెండర్లు వేశారు. గతంలో చేప పిల్లలను పంపిణీ చేయకుండా బిల్లులు ఎత్తుకున్నారన్న విషయం మాకు తెలియదు. ఎవరైనా అలా చేస్తే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే సదరు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతాం.

- సౌజన్య, ఫిషరీస్‌ ఆఫీసర్‌, సూర్యాపేట