కరోనా వ్యాక్సిన్ సప్లై ఎట్లా?..ఒక్కో వ్యాక్సిన్‌‌కు ఒక్కో రకమైన టెంపరేచర్

కరోనా వ్యాక్సిన్ సప్లై ఎట్లా?..ఒక్కో వ్యాక్సిన్‌‌కు ఒక్కో రకమైన టెంపరేచర్
  • మనదేశంలో కోల్డ్ చెయిన్ వసతులు తక్కువే!
  • 11 వేలకు పైగా రిఫ్రిజిరేటర్ ట్రక్‌ లు అవసరం
  • వ్యాక్సిన్‌‌ను దూర ప్రాంతాలకు చేర్చడం కష్టమే
  • ఒక్కో వ్యాక్సిన్‌‌కు ఒక్కో రకమైన టెంపరేచర్ అవసరం

కరోనా వైరస్ వ్యాక్సిన్‌‌ను అన్ని దేశాల ప్రజలకు సరఫరా చేయడం సవాలుగా మారింది. ఇప్పటికే చాలా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్‌‌ చేపడుతున్నాయి. త్వరలో వ్యాక్సిన్​ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుణేకు చెందిన సీరమ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్‌‌ఫర్డ్‌‌ యూనివర్సిటీ,ఆస్ట్రాజెనికాతో కలిసి 100 కోట్ల డోస్‌‌ల కరోనా వ్యాక్సిన్‌‌ను తయారు చేస్తుందని ఆ కంపెనీ  సీఈవో ఆదర్ పూనావాలా ఇంతకుముందే ప్రకటించారు.  ఈ వ్యాక్సిన్‌‌ను ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికీ సప్లై చేసేందుకు రూ.80 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాలన్నారు. వ్యాక్సిన్‌‌ను ప్రజలందరికీ సప్లై చేయాలంటే కోల్డ్ చెయిన్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్, వేర్‌‌‌‌హౌసింగ్, ట్రాన్స్‌‌పోర్టేషన్ అవసరం. అన్ని కరోనా వ్యాక్సిన్‌‌లకు ఒకే రకమైన వాతావరణం సరిపోదు.    ఆక్స్‌‌ఫర్డ్–ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌‌ ప్రొటీన్ బేస్డ్ వ్యాక్సిన్. ఇది మరీ గడ్డకట్టే వాతావరణంలో ఉండాల్సినవసరం లేదు. కానీ 2 నుంచి 8 సెంటిగ్రేడ్‌‌ మధ్య టెంపరేచర్‌‌లో ఉండాలి. మోడర్నా, ఫైజర్–బయోఎన్‌‌టెక్‌‌లు రూపొందించే మరో రెండు కరోనా వ్యాక్సిన్‌‌లు రిఫ్రిజరేషన్ కంటే ఎక్కువ చలి అవసరం. మోడర్నా వ్యాక్సిన్‌‌కు మైనస్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ , ఫైజర్–బయోఎన్‌‌టెక్‌‌ వ్యాక్సిన్‌‌కు మైనస్ 70 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ కావాల్సి ఉంది.  డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ కూడా రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌‌ 10 కోట్ల డోస్‌‌లను డిస్ట్రిబ్యూట్ చేయనుంది. దీనిని మైనస్ 18 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వద్ద స్టోర్ చేయాలి.

రవాణా ఎంతో కీలకం...

ఈ వ్యాక్సిన్‌‌లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేయడానికి కోల్డ్ చెయిన్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ తప్పనిసరి. మన హెల్త్ మినిస్ట్రీ 2021 జూలై నాటికి 40–50 కోట్ల వరకు వ్యాక్సిన్ డోస్‌‌లను ఉత్పత్తి చేయాలని, 20–25 కోట్ల మందికి ఇమ్యూనిటీ అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో కోల్డ్ చెయిన్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను కూడా ప్రభుత్వం రెడీ చేసుకోవాలి.  2018 వరకు, ఇండియాలో కోల్డ్ స్టోరేజ్ కెపాసిటీ 3.5 కోట్ల మెట్రిక్ టన్నులు. దేశంలో 10 వేల మంది కోల్డ్ చెయిన్ ప్రొవైడర్లు ఉన్నా,వీరిలో 5 శాతం మంది వద్దనే 5 వేల టన్నుల కెపాసిటీ ఉంది. డబ్ల్యూహెచ్‌‌ఓ గైడ్‌‌లైన్స్ ప్రకారం కొన్ని మాత్రమే ఫార్మా కంప్లియెంట్‌‌తో ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌‌ఓ–జీడీపీ(గూడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాక్టీసెస్) గురించి  అడిగితే 9,700 మంది తమకు తెలియదనే చెపుతారని ఇండస్ట్రీ ఇన్‌‌సైడర్ ఒకరు చెప్పారు. పెద్ద కంపెనీలంటే స్నోమ్యాన్ లాజిస్టిక్స్, గతి కౌసర్, కూల్–ఎక్స్,డీహెచ్‌‌ఎల్, కోల్డ్‌‌స్టార్ లాజిస్టిక్స్, ఎంజే లాజిస్టిక్స్, గుబ్బా కోల్డ్ స్టోరేజ్ వంటివే ఉన్నాయి. ట్రాన్స్‌‌పోర్టేషన్ పరంగా చూసుకుంటే ఇండియాలో 2018 నాటికి లక్షా 27 వేల రిఫ్రిజిరేటెడ్ వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. వ్యాక్సిన్ లాజిస్టిక్స్‌‌కు రియల్ టైమ్, ఎండ్ టూ ఎండ్ మానిటరింగ్ అవసరం.  రియల్ టైమ్ టెంపరేచర్ ట్రాకింగ్‌‌ సరిగ్గా లేకపోతే సమస్యలు వస్తాయి.

చాలా కరోనా వ్యాక్సిన్ల ప్రొడక్షన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుణే(సీరమ్ ఇన్‌‌స్టిట్యూట్), గుజరాత్ (జైడస్ క్యాడిలా)లలో జరగనుంది. అయితే ఎంతమొత్తంలో కరోనా వ్యాక్సిన్లు స్టోర్ చేయగలం, ఏ మేరకు ట్రాన్స్‌‌పోర్ట్ చేయగలమనే విషయంలో క్లారిటీ లేదు. ‘2 ఎంఎల్ సీసాలో కరోనా వ్యాక్సిన్‌‌ను ఫిల్ చేస్తే.. ఒక్కో ట్రక్‌‌లో సుమారు 40 వేల నుంచి 50 వేల సీసాలను సరఫరా చేయొచ్చు. ఒక్కో రిఫ్రిజరేటర్ ట్రక్కు  కెపాసిటీ 7 టన్నులు ఉంటుంది. 40 కోట్ల సీసాలు, ఒక్కోటి 200 గ్రాములుంటే.. మనకు 30 వేల టన్నుల ట్రాన్స్‌‌పోర్టేషన్ కెపాసిటీ కావాల్సి ఉంటుంది. అంటే 11,500 వెహికల్స్ అవసరం అన్నమాట’ అని స్కార్పియాన్ గ్రూప్ ఎండీ జేపీఎన్ సింగ్ చెప్పారు.  ‘హైదరాబాద్ నుంచి పాట్నాకు కోల్డ్ చెయిన్ వెహికల్స్ అరేంజ్ చేయడం పెద్ద సమస్య కాదు. కానీ పట్నా నుంచి పూర్నియా వంటి ప్రాంతాలకు కోల్డ్ చెయిన్ వెహికల్స్‌‌ను తీసుకెళ్లడం కాస్త కష్టమే’ అని సింగ్ అన్నారు.  పోలియో వ్యాక్సిన్లను   బాటిల్‌‌లో తీసుకెళ్లి, ఒక్కో చిన్నారికి  వేస్తారు. కానీ కరోనా వ్యాక్సిన్ అలా కాదు. 2ఎంఎల్‌‌ సీసాలో తీసుకెళ్లి, వాటిని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని హ్యాండిల్ చేయడం కూడా కష్టతరమే. తుది గమ్యం వరకు రిఫ్రిజరేషన్ పాయింట్లు అవసరం. ఇందుకు ప్రభుత్వం ప్రైవేటు ప్లేయర్లతో కలసి పనిచేయాలని ఎక్స్‌‌పర్టులు సూచిస్తున్నారు.

స్పుత్నిక్‌‌-వీ ఫేజ్‌ 2 హ్యుమన్ట్రయల్స్‌‌కు డీసీజీఐ ఓకే

న్యూఢిల్లీ:   స్పుత్నిక్‌‌ వీ ఫేజ్‌‌–2,3 ట్రయల్స్‌‌ను ఇండియాలో జరిపేందుకు డాక్టర్‌‌ రెడ్డీస్‌‌కు డీసీజీఐ అనుమతిచ్చింది. ఫేజ్–2 ట్రయల్స్‌‌ను 100 మందిపై, ఫేజ్‌‌–3 ట్రయల్స్‌‌ను 1,400 మందిపై డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ చేపట్టనుందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. ఈ వ్యాక్సిన్‌‌ ఫేజ్‌‌–2 ట్రయల్స్‌‌ రిజల్ట్స్‌‌ను డీసీజీఐ ఎక్స్‌‌పర్ట్‌‌ కమిటీ విశ్లేషిస్తుంది. ఆ తర్వాత ఫేజ్‌‌–3 ట్రయల్స్‌‌ చేపట్టేందుకు అనుమతి లభిస్తుంది. స్పుత్నిక్ వీ ట్రయల్స్‌‌ కోసం గతంలో డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ డీసీజీఐకి అప్లికేషన్‌‌ పెట్టుకున్న విషయం తెలిసిందే. అప్లికేషన్‌లో పూర్తి వివరాలు లేవని, మళ్లీ అప్లికేషన్‌ను పెట్టాలని అప్పుడు కమీటీ ఆదేశించింది.