
హైదరాబాద్, వెలుగు: కొత్త నేర చట్టాలపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు అధికారులకు మార్గనిర్దేశం చేసేందుకు సీఐడీ విభాగంలో ఒక సపోర్ట్ సెంటర్ ఏర్పాటు చేశామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఈ సపోర్ట్ సెంటర్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ అధికారుల సందేహాలు నివృత్తి చేస్తుందని చెప్పారు. వివిధ విభాగాలకు చెందిన నిపుణులు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని, సిబ్బందికి వారు తగిన సూచనలిస్తారన్నారు.
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలపై తెలుగు, ఇంగ్లిష్లో రూపొందించిన పోస్టర్లను అదనపు డీజీలు శిఖా గోయల్, అభిలాష బిస్త్, మహేశ్ భగవత్, వీవీ శ్రీనివాసరావు, ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతితో కలిసి డీజీపీ రవిగుప్తా సోమవారం తన ఆఫీసులో ఆవిష్కరించారు. కొత్త చట్టాల అమలుపై రూపొందించిన బుక్లెట్ను కూడా ఆవిష్కరించి, మాట్లాడారు. నూతన చట్టాల అమలులో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు అంతా ఒకే రీతిలో వ్యవహరించేలా ఈ బుక్లెట్ ఉపయోగపడుతుందని తెలిపారు. సీఐడీ, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ అధికారుల సమన్వయంతో బుక్ లెట్లను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను డీజీపీ అభినందించారు.