ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
  • ‘శివసేన’పై ఇప్పుడే నిర్ణయం వద్దు
  • ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు ఆదేశం
  • కేసును రాజ్యాంగ బెంచ్​కు ఇవ్వడంపై 8న నిర్ణయం  
  • ఉద్ధవ్ థాక్రే టీంకు భారీ ఊరట

న్యూఢిల్లీ/ముంబై: శివసేన పార్టీ ఎవరిదన్న విషయంపై ఇప్పుడే నిర్ణయం తీస్కోవద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం ఉందా? లేదా? అన్నది తాము తేల్చేంతవరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే టీంకు భారీ ఊరట లభించినట్లయింది. అసలైన శివసేన తమదేనని డిక్లేర్ చేయాలంటూ థాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. ‘‘మాదే రియల్ శివసేన. 15 మంది ఎమ్మెల్యేలతో కూడిన గ్రూప్ 39 మందితో కూడిన గ్రూప్ ను రెబెల్స్ అని పిలవలేరు” అని షిండే తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే కోర్టుకు విన్నవించారు. శివసేనలో మెజారీటీ తమకే ఉందని, ప్రజాస్వామ్యబద్ధంగా మెజార్టీ నిరూపించుకుని, పార్టీ అంతర్గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదంటూ వాదించారు. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ఎన్నికైన తర్వాత పొలిటికల్ పార్టీలను పూర్తిగా విస్మరిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా? అని ప్రశ్నించారు. సేన రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై క్లారిటీ వచ్చే వరకూ శివసేన ఎవరిదన్న దానిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోకుండా ఆపాలని థాక్రే టీం కోరింది. కాగా, ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీపై  సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

సంజయ్ రౌత్ కస్టడీ పొడిగింపు..   

మనీల్యాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కస్టడీని ముంబైలోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పెషల్ కోర్టు ఈ నెల 8 వరకూ పొడిగించింది. మరోవైపు పత్రా చాల్ ల్యాండ్ స్కాం కేసులో రౌత్ భార్య వర్షా రౌత్ కు ఈడీ సమన్ లు జారీ చేసింది. అయితే, వర్షా రౌత్ ను ఏ రోజు విచారణకు హాజరు కావాలని ఆదేశించారో వెల్లడికాలేదు. 

ఇయ్యాల్నే షిండే  కేబినెట్ విస్తరణ?  

మహారాష్ట్ర సీఎం షిండే శుక్రవారం కేబినెట్ విస్తరణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. త్వరలో అసెంబ్లీ సెషన్ జరగనుండటంతో కేబినెట్ విస్తరణ అత్యవసరంగా మారింది. దీంతో మంత్రుల లిస్టును షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ సిద్ధం చేశారు. అయితే, పని ఒత్తిడి వల్ల షిండే కొంత అస్వస్థతకు గురికావడంతో డాక్టర్ల సూచనతో  ఢిల్లీ ట్రిప్​ను రద్దు చేసుకున్నారు. మంత్రుల లిస్టుతో ఫడ్నవీస్ ఢిల్లీకి బయలుదేరారు. బీజేపీ పెద్దలు ఓకే చెప్తే.. శుక్రవారమే కేబినెట్ విస్తరణ జరగనుంది. షిండే కేబినెట్​లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఏడుగురు షిండే గ్రూప్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేసే చాన్సెస్ ఉన్నాయి. ఆపై మరిన్ని  దఫాల్లో కేబినెట్ విస్తరణ జరిగే చాన్స్ ఉంది.