జస్టిస్ ఎన్వీరమణ చేతుల మీదుగా భూమి పూజ, ప్రారంభోత్సవం

జస్టిస్ ఎన్వీరమణ చేతుల మీదుగా భూమి పూజ, ప్రారంభోత్సవం

విజయవాడ: న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలకు సత్వర న్యాయం చేసే బాధ్యత న్యాయవాదులపై ఉందని ఆయన చెప్పారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని న్యాయస్థానాల  ప్రాంగణంలో నిర్మించిన  జీ+7  కొత్త  భవనాల కాంప్లెక్స్ ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, హైకోర్టు  సీజే ప్రశాంత్ కుమార్  మిశ్రతో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో మొక్కలు  నాటారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ 10 ఏళ్ల కిందట తాను శంకుస్థాపన చేసిన భవనాలకు.. మళ్లీ తానే ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందన్నారు. కొత్త భవనాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. న్యాయ వ్యవస్థలో ఖాళీలు భర్తీ చేసుకుంటూ వస్తున్నామని, సమాజంలో మార్పు కోసం న్యాయవాదులు కృషి చేయాలన్నారు. న్యాయ వ్యవస్థను పటిష్ట పరిచే కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవసరం అని, న్యాయ వ్యవస్థ ప్రజలకు చేరువలోనే ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్  కౌన్సిల్, బార్  అసోసియేషన్  ప్రతినిధులు  పాల్గొన్నారు.