పెండ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు: సుప్రీం కోర్టు

పెండ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు: సుప్రీం కోర్టు
  • పెండ్లికి ముందు రిలేషన్ను తప్పుగా చూడలేం 
  • వ్యక్తిగత ప్రేమ సంబంధాల ఆధారంగా ఉద్యోగం నిరాకరించడం సరికాదు
  • తెలంగాణకు చెందిన కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు 
  • ఈ రోజుల్లో పెండ్లికి ముందు మేజర్లు రిలేషన్‌‌లో ఉండటం సర్వసాధారణం
  • దానిని నిషేధించే చట్టం మన దేశంలో ఏదీ లేదు
  • ప్రేమించుకున్న ప్రతి ఒక్కరూ పెండ్లి చేసుకుంటారని గ్యారంటీ లేదు
  • ఆ కారణంతో ఒకరి క్యారెక్టర్ తప్పు అని చెప్పలేమని వ్యాఖ్య

పెండ్లికి ముందు ఇద్దరు మేజర్లు అంగీకారంతో శారీరక సంబంధం కలిగి ఉండడం నేరం కాదని.. దాని ఆధారంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ను తప్పుపట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కారణంతో ఓ వ్యక్తికి కానిస్టేబుల్ ​ఉద్యోగాన్ని నిరాకరించడాన్ని తప్పుబట్టింది.

న్యూఢిల్లీ, వెలుగు: పెండ్లికి ముందు ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో పెట్టుకునే శారీరక సంబంధం నేరం కాదని.. దాని ఆధారంగా ఒక వ్యక్తి క్యారెక్టర్ ను తప్పుపట్టలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మారుతున్న సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా అధికారులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని సూచించింది. ప్రతి రిలేషన్ షిప్ పెండ్లి వరకు వెళ్లకపోవచ్చని అభిప్రాయపడింది. పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డు.. తన క్యారెక్టర్ సరిగా లేదంటూ కానిస్టేబుల్​ఉద్యోగాన్ని నిరాకరించడాన్ని తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు.

ఈ పిటిషన్ ను సోమవారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ మేరకు అభ్యర్థి ఎంపిక రద్దును కొట్టివేస్తూ.. బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుపతికి వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అలాగే, గాజుల తిరుపతి ఎంపికను రద్దు చేసిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి, అభ్యర్థి నియామక అంశాన్ని తిరిగి పరిశీలించాలని తెలంగాణ పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డును ఆదేశించింది.

కేసు పూర్వాపరాలు..
గాజుల తిరుపతి అనే యువకుడు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే, గతంలో అతనిపై ఒక క్రిమినల్ కేస్ ఉండటంతో బోర్డు అతని ఉద్యోగాన్ని రద్దు చేసింది. అతని ఇంటి పక్కన ఉండే ఒక యువతి.. తిరుపతి తనను పెండ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేండ్లు రిలేషన్‌‌లో ఉండి, ఆ తర్వాత వేరే అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై 2014లో కేసు నమోదైనప్పటికీ.. 2015లోనే లోక్ అదాలత్ ద్వారా ఇద్దరూ రాజీ పడ్డారు. దాంతో ఆ కేసు ముగిసిపోయింది.

రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్ణయాన్ని తప్పుపట్టిన సుప్రీం..
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు తిరుపతి ఈ కేసు వివరాలను దాచకుండా ఫారమ్‌‌లో నిజాయతీగా రాశాడని కోర్టు గుర్తించింది. అయినప్పటికీ పోలీస్ బోర్డు మాత్రం ఇది నైతిక ప్రవర్తనకు సంబంధించిన నేరం, కాబట్టి ఇతను పోలీస్ ఉద్యోగానికి పనికిరాడని అతని ఎంపికను రద్దు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది.

‘ఈ రోజుల్లో పెండ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపడి రిలేషన్‌‌లో ఉండటం సర్వసాధారణం. మన దేశంలో ఇద్దరు ఇష్టపూర్వకంగా కలిసి ఉండటాన్ని నిషేధించే చట్టం ఏదీ లేదు. కేవలం ఆ కారణంతో ఒకరి క్యారెక్టర్ తప్పు అని చెప్పలేం. ప్రేమించుకున్న ప్రతి ఒక్కరూ పెండ్లి చేసుకుంటారని గ్యారంటీ లేదు.

కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయితే.. ఒకరు మరొకరిని మోసం చేశారని బ్లేమ్ చేయలేం.. ఇక్కడ అమ్మాయి కూడా ఎలాంటి బలవంతం లేదని, కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినప్పుడు యువకుడిని తప్పుబట్టలేం’ అని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. గతంలో గొడవలు, హింసకు సంబంధించిన కేసుల్లో రాజీ పడితే ఉద్యోగాలు నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి కానీ.. ఇది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విషయమని కోర్టు స్పష్టం చేసింది.