
డాక్టర్ చదువులు చదివేందుకు దేశ వ్యాప్తంగా నిర్వహించే ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ (NEET – UG) రాయలేకపోయిన విద్యార్థులకు సెకండ్ చాన్స్ వచ్చింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండోసారి పరీక్ష పెట్టేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. కరోనా పాజిటివ్ రావడం వల్ల లేదా కంటైన్మెంట్ జోన్లలో ఉండడం వల్ల సెప్టెంబర్ 13న జరిగిన నీట్ పరీక్షకు వెళ్లలేకపోయారని, ప్రస్తుతం నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మరోసారి పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వం తరఫున కోరారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నీట్ పరీక్ష హాజరుకాలేకపోయిన వాళ్లందరికీ బుధవారం (అక్టోబర్ 14న) పరీక్ష పెట్టేందుకు అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. బోబ్డే నేతృత్వంలోని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా గతంలో పలు మార్లు పరీక్ష వాయిదా పడుతూ వచ్చినందున ఇప్పుడు రెండోసారి పరీక్ష పెట్టేందుకు అనుమతిస్తున్నామని బెంచ్ చెప్పింది. కాగా, నీట్ పరీక్ష రిజల్ట్స్ ఈ నెల 16న విడుదల చేస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ప్రకటించారు.