మరో ఘోరం జరిగేదాకా చూస్తూ ఉండాల్నా?..కోల్​కతా డాక్టర్ రేప్, మర్డర్ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మరో ఘోరం జరిగేదాకా చూస్తూ ఉండాల్నా?..కోల్​కతా డాక్టర్ రేప్, మర్డర్ ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • దేశవ్యాప్తంగా వైద్య రంగంలో మార్పు రావాల్సిందే
  • వైద్య సిబ్బందికి సేఫ్టీ లేకపోవడం వ్యవస్థ వైఫల్యమే
  • అందుకే మేం జోక్యం చేసుకుంటున్నం 
  • డాక్టర్ల భద్రతకు ప్రొటోకాల్​పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నం 
  • దారుణ నేరం జరిగితే.. ఆత్మహత్య అని ప్రిన్సిపాల్ చెప్పడమేంటి? 
  • కేసులో బెంగాల్ సర్కార్, పోలీసుల తీరుపైనా సీజేఐ బెంచ్ సీరియస్

న్యూఢిల్లీ/కోల్​కతా : కోల్​కతాలో మహిళా డాక్టర్​పై ఆస్పత్రిలోనే అత్యాచారం, హత్య జరిగిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో దారుణం జరిగేవరకు చూస్తూ ఉండబోమని  తేల్చి చెప్పింది. దేశవ్యాప్తంగా దవాఖాన్లలో వైద్య సిబ్బందికి భద్రత, సౌలతులు లేకపోవడం వ్యవస్థ వైఫల్యమేనని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిందేనని.. అందుకే తాము జోక్యం చేసుకుంటున్నామని వెల్లడించింది. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది భద్రతకు ప్రొటోకాల్ రూపొందించడం కోసం పది మంది సభ్యులతో నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ టాస్క్​ఫోర్స్​ రెండు నెలల్లోపు ఫైనల్​​ రిపోర్ట్​ ఇవ్వాలని తెలిపింది.

కోల్ కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ఈ నెల 9న మహిళా డాక్టర్ రేప్, హత్యకు గురైన ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ముగ్గురు సభ్యుల బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ‘‘దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున నిరసనలు తెలపడాన్ని బట్టి..  డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి దేశవ్యాప్తంగా దవాఖాన్లలో భద్రతలేని విషయం బయటపడింది.  వైద్య సిబ్బంది దాడులకు, హింసకు గురవుతుండటం దురదృష్టకరం” అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ‘‘డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిపై ఆస్పత్రుల్లోనే దాడులు జరగడం అంటే వారిని రక్షించడంలో ఇది వ్యవస్థ వైఫల్యమే” అని స్పష్టం చేశారు.

బెంగాల్ సర్కార్, పోలీసులపై ఫైర్ 

దవాఖానలో అతి దారుణంగా మహిళా డాక్టర్ పై రేప్, మర్డర్ జరిగితే.. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో అంత ఆలస్యం చేయడం ఏమిటంటూ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నేరం జరిగిందని ఉదయమే గుర్తించారు. ఇంత దారుణంగా నేరం జరిగితే.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ దీనిని ఆత్మహత్యగా ఎందుకు చెప్పారు? కొన్ని గంటల పాటు బాధితురాలి మృతదేహాన్ని తల్లిదండ్రులకు ఎందుకు చూపించలేదు? సంఘటన జరిగిన ఆర్జీ కర్ ఆస్పత్రిలోకి అల్లరిమూకలు ప్రవేశిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రిన్సిపాల్ ప్రవర్తనపై అనుమానాలు వచ్చినా.. వెంటనే అతడిని మరో కాలేజీకి ప్రిన్సిపాల్​గా ఎలా నియమించారు?” అని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కుటుంబసభ్యులకు అప్పగించిన కొన్ని గంటల తర్వాత రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. అంత జాప్యం ఎందుకైందని ప్రశ్నించింది. బాధితురాలి పేరు, ఫొటోలు, ఆమె డెడ్ బాడీతో కూడిన వీడియో క్లిప్​లు మీడియాలో రావడంపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో ప్రస్తుత పురోగతిపై స్టేటస్ రిపోర్టును అందజేయాలని సీబీఐని ఆదేశించింది. ఆస్పత్రిలో విధ్వంసానికి పాల్పడినవారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

అందుకే జోక్యం చేసుకుంటున్నాం 

దేశవ్యాప్తంగా వైద్య సిబ్బందికి భద్రత లేకపోవడం, ఇది వ్యవస్థ వైఫల్యానికి సంబంధించిన అంశం అయినందున తాము జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సీజేఐ బెంచ్ తేల్చిచెప్పింది. దవాఖాన్లలో ప్రధానంగా మహిళలు తోటి ఉద్యోగులు, సీనియర్లు, అధికారుల నుంచి కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. 1973లో ముంబైలోని ఓ ఆస్పత్రిలో లైంగిక దాడికి గురై కోమాలోకి వెళ్లిన నర్సు అరుణా షాన్ బాగ్.. 42 ఏండ్ల పాటు అదే ఆస్పత్రిలో కోమాలో ఉండి 2015లో చనిపోయిన ఉదంతాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ‘‘పని చేసే చోట మహిళలకు భద్రత కల్పించకపోతే వారికి రాజ్యాంగం ఇచ్చిన సమానత్వపు హక్కును నిరాకరిస్తున్నట్టే” అని బెంచ్ స్పష్టం చేసింది. ‘‘వైద్య సిబ్బందిపై దాడులు నివారించేందుకు అనేక రాష్ట్రాలు చట్టాలు తెచ్చాయి. కానీ భద్రతా ప్రమాణాలు, సౌలతులు లేకపోతే ఇలాంటి శిక్షలతో ఉపయోగం ఉండదు. అందుకే దవాఖాన్లలో వైద్య సిబ్బంది భద్రత, ఇతర సౌలతులపై ప్రొటోకాల్స్ రూపొందించడం కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్టీఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నాం”అని సుప్రీంకోర్టు ప్రకటించింది. టాస్క్ ఫోర్స్ మూడు వారాల్లోపు మధ్యంతర నివేదికను, రెండు నెలల్లోపు తుది నివేదికను ఇస్తుందని తెలిపింది. 

టాస్క్ ఫోర్స్ చేయాల్సింది ఇదే.. 

  • నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్టీఎఫ్) చీఫ్​గా వైస్ అడ్మిరల్ ఆర్తి శరీన్ (నేవీ మెడికల్ సర్వీసెస్ డీజీ)ను, సభ్యులుగా డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్), డాక్టర్ ఎం.శ్రీనివాస్ (ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్), డాక్టర్ ప్రతిమామూర్తి (బెంగళూరులోని ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్ డైరెక్టర్) తదితరులను సుప్రీంకోర్టు నియమించింది. 
  • దవాఖాన్లలో వైద్య సిబ్బందిపై దాడులు, మహిళా వైద్య సిబ్బందిపై లింగపరమైన దాడుల నివారణకు.. పనిచేసే చోట ఇంటర్నులు, రెసిడెంట్లు, సీనియర్ రెసిడెంట్లు, డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి హుందాగా, సురక్షితంగా పనిచేసుకునే పరిస్థితులు కల్పించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. 
  • సుప్రీంకోర్టు సూచించిన పై రెండు అంశాలపైనే కాకుండా తాము గుర్తించే ఇతర అంశాలపైనా టాస్క్ ఫోర్స్ సభ్యులు సిఫారసు చేయొచ్చు.
  • హాస్పిటల్స్​లో ప్రస్తుత సౌకర్యాలను బట్టి.. అమలు చేయాల్సిన సిఫారసుల వరుసక్రమం(టైమ్ లైన్) కూడా సూచించవచ్చు. నివేదిక తయారీ కోసం అన్ని రకాల స్టేక్ హోల్డర్లను ఎన్టీఎఫ్ సంప్రదించాలి.  
  • టాస్క్​ఫోర్స్ సభ్యుల ప్రయాణ ఖర్చులు, బస, ఆఫీసు నిర్వహణ, ఇతర ఖర్చులన్నింటినీ కేంద్ర ఆరోగ్య శాఖ భరించాలి. టాస్క్ ఫోర్స్ కు అవసరమైన ఇతర ఏర్పాట్లు కూడా చూసుకోవాలి. 
  • రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రతా సిబ్బంది, ఇతర సమాచారాన్ని ఆరోగ్య శాఖ సెక్రటరీల ద్వారా టాస్క్ ఫోర్స్​కు అందజేయాలి. 
  • దవాఖాన్ల ఎంట్రెన్సుల్లో లగేజీని, వ్యక్తులను స్కీనింగ్ చేసే వ్యవస్థ ఉందా? హాస్పిటల్​లో మొత్తం ఎన్ని రెస్టింగ్/ డ్యూటీ రూంలు ఉన్నాయి? వాటిలో సౌలతులు ఏమున్నాయి?.. ఇలా ప్రతి డిపార్ట్ మెంట్​కు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలి.  
  • పైన చెప్పిన అన్ని వివరాలను వరుస క్రమంలో పొందుపర్చి కేంద్ర ప్రభుత్వం నెల రోజుల్లోపు అఫిడవిట్​ను అందజేయాలి.    

అతన్ని ఉరి తీయండి..కోల్‌‌‌‌కతా ఘటన నిందితుడి అత్త

కోల్‌‌‌‌కతా: ట్రెయినీ డాక్టర్‌‌‌‌పై అత్యాచారం ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్​ని ఉరితీయాలని అతని అత్త దుర్గాదేవి డిమాండ్ చేశారు. సంజయ్ రాయ్ వల్ల తన కూతురు చాలా కష్టాలు పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. అతను తరచూ కొట్టడం వల్లే తన కూతురుకు గర్భస్రావం అయ్యిందని వెల్లడించారు. అంతటి ఘోరమైన నేరానికి పాల్పడే శక్తి సంజయ్ రాయ్  ఒక్కడికి లేదని,  మరికొంత మంది నేరానికి పాల్పడి ఉండొచ్చని దుర్గాదేవి అనుమానం వ్యక్తం చేశారు. 

సమ్మె విరమించండి

డాక్టర్లకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ: కోల్‌‌‌‌కతాలో ట్రెయినీ డాక్టర్ పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు  సూచించింది. ‘‘దయచేసి మమ్మల్ని నమ్మండి’’ అని సుప్రీం బెంచ్​ మంగళవారం కోరింది. డాక్టర్లు డ్యూటీలకు దూరంగా ఉండడం వల్ల రోగుల ట్రీట్మెంట్​పై తీవ్ర ప్రభావం పడుతోందని కోర్టు సూచించింది. కాబట్టి డాక్టర్లంతా త్వరగా డ్యూటీల్లో చేరాలని సూచించింది. దీంతో రామ్ మనోహర్ లోహియా(ఆర్ఎంఎల్) ఆస్పత్రిలో చేపట్టిన సమ్మెను డాక్టర్లు విరమించారు.