వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమైతది?

వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు  ఇస్తే ఏమైతది?
  • ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటదా
  • ఎన్నికల కమిషన్​ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
  • స్లిప్​ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ
  • వీవీప్యాట్​లోనే చూసుకుంటే బెటర్ అని సూచన
  • ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి
  • ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లపై విచారణ

న్యూఢిల్లీ: వీవీ ప్యాట్​లో ప్రింట్ అయిన స్లిప్​లను ఓటర్లకు ఇస్తే ఏమవుతుందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్​ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, దీని కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరంగా చెప్పాలని ఆదేశించింది. వీవీ ప్యాట్ స్లిప్ ఇస్తే సదరు ఓటర్​కు కూడా క్లారిటీ వస్తుంది కదా అని అభిప్రాయపడింది. స్లిప్ బయటికి తీస్తే ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటుందా? అని కూడా ఈసీని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఓటర్​కు భరోసా కల్పించేందుకు మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పాలని ఆదేశించింది. 

దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్.. వీవీ ప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇవ్వడం రిస్క్ అని సుప్రీం కోర్టుకు తెలిపింది. స్లిప్ పోలింగ్ సెంటర్ నుంచి బయటికివెళ్తే ఎవరు.. ఎలా ఉపయోగించుకుంటారో తెలీదని వివరించింది. ఓటు వేశాక పక్కనే ఉన్న వీవీప్యాట్​లో ఏడు సెకన్ల పాటు లైట్ వెలుగుతుందని, అప్పుడే స్లిప్ కూడా స్పష్టంగా కనిపిస్తుందని ఈసీ సుప్రీం కోర్టుకు చెప్పింది. వీవీ ప్యాట్ స్లిప్​లు తీసుకుని.. వాటిని మళ్లీ బ్యాలెట్ బాక్స్​లో వేయడం సరికాదని అభిప్రాయపడింది. ఇది ఎన్నికల ప్రక్రియను మళ్లీ పాత పద్ధతికి తీసుకెళ్లడమే అవుతుందని తెలిపింది. 

కౌంటింగ్‌‌ టైమ్​లో వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా రూపొందించిన పేపర్ స్లిప్‌‌లను, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌‌ (ఈవీఎం)లో పోలైన ఓట్లతో క్రాస్ చెక్ చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌‌ సంజీవ్‌‌ ఖన్నా, జస్టిస్‌‌ దీపాంకర్‌‌ దత్తా ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఎన్నికల కమిషన్ తరఫున సీనియర్ అడ్వకేట్ మణిందర్ సింగ్, పిటిషనర్లలో ఒకరి తరఫున అడ్వకేట్‌‌ నిజాంపాషా వాదనలు వినిపించారు. పోలింగ్ కేంద్రంలో ఓటేశాక సదరు ఓటర్ వీవీప్యాట్ స్లిప్ తీసుకుని బ్యాలెట్ బాక్స్​లో వేసేందుకు అనుమతివ్వాలని నిజాంపాషా కోర్టుకు విన్నవించారు. 

దీనిపై జస్టిస్ ఖన్నా స్పందిస్తూ.. ‘‘ఇలా చేయడంతో ఓటరు ప్రైవసీ దెబ్బతినదా?’’అని ప్రశ్నించగా.. ‘‘ఓటర్ ప్రైవసీ, ఓటరు హక్కులకు భంగం కలగదు’’అని పాషా బదులిచ్చారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ తరఫున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. ‘‘వీవీప్యాట్​లోని లైట్ ఎప్పుడూ ఆన్​లోనే ఉండాలి. ప్రస్తుతం అందులోని లైట్ కేవలం ఏడు సెకన్లు మాత్రమే వెలుగుతుంది. పేపర్ స్లిప్ ఇవ్వడం వీలుకాకపోతే.. వీవీప్యాట్​లోని లైట్ ఆన్​లో ఉంచినా సరిపోతుంది. ఓటర్ స్లిప్ కట్ అయి.. బాక్స్​లో పడిపోయే టైమ్​లో సదరు ఓటర్ స్లిప్ చూసేందుకు వీలవుతుంది. అప్పుడు వారి ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు’’అని తెలిపారు. 

సెపరేట్ ఆడిట్ ఉండాలి

పిటిషనర్ల తరఫున మరో సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రాసెస్ పారదర్శకంగా జరగాలంటే.. సెపరేట్ ఆడిట్ ఉండాలని ధర్మాసనానికి విన్నవించారు. ఈ సందర్భంగా కేరళలో నిర్వహించిన మాక్​పోలింగ్ నివేదికలోని అంశాల గురించి ప్రస్తావించారు. అక్కడ బీజేపీకి అదనంగా ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. స్పందించిన ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీ తరఫు అడ్వకేట్ మణిందర్ సింగ్​ను ధర్మాసనం కోరగా.. ఈ నివేదిక పూర్తిగా అబద్ధమని ఆయన కోర్టుకు వివరించారు. ‘‘ఈవీఎంలో ఓటేశాక అందులోని కంట్రోల్ యూనిట్ ద్వారా వీవీ ప్యాట్​లో పేపర్ స్లిప్ ప్రింట్ అవుతుంది. ఈ స్లిప్ సీల్డ్ బాక్స్​లో పడే ముందు లోపల లైట్ ఆన్ అవుతుంది. ఏడు సెకన్ల పాటు సదరు ఓటరుకు ఆ స్లిప్ కనిపిస్తుంది. పోలింగ్​కు ముందు కూడా ఈవీఎం, వీవీప్యాట్​ల పనితీరును ఇంజినీర్ల సమక్షంలో ట్రయల్ చేస్తారు’’అని కోర్టుకు ఈసీ వివరించింది. 

పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే తరలింపు

మెషిన్ ప్రోగ్రామ్​లో ఎలాంటి మార్పులు జరగవని, ఓటేసినప్పటి నుంచి వాటిని స్ట్రాంగ్ రూమ్​కు తరలించేదాకా వివిధ పార్టీల ఏజెంట్లు వెంటే ఉంటారని కోర్టుకు ఈసీ వివరించింది. ఓటేశాక స్లిప్ తీసుకోవడం సాధ్యమేనా ఈసీని ప్రశ్నించగా.. ‘‘స్లిప్ తీసుకోవడంతో ఓటరు ప్రైవసీకి భంగం కలుగుతుంది. స్లిప్ పోలింగ్ కేంద్రం నుంచి బయటికెళ్తే దుర్వినియోగం అవుతుంది. స్లిప్​ను వేరేవాళ్లు ఎలా ఉపయోగిస్తారో చెప్పలేం’’అని పేర్కొంది. వీవీ ప్యాట్ స్లిప్ కౌంటింగ్​కు ఎందుకు టైమ్ ఎక్కువపడుతుందని ప్రశ్నించగా.. పేపర్ పలచగా, జిగటగా ఉంటుందని బదులిచ్చింది. స్లిప్ ఇవ్వాలన్న పిటిషనర్ల ఆలోచన కూడా సరికాదని, ఇది ఎన్నికల ప్రక్రియను పాత పద్ధతికి తీసుకెళ్లడమే అవుతుందని ఈసీ తెలిపింది. ఓటర్ల విశ్వాసం పొందేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని చివరి ధర్మాసనం ఈసీని ఆదేశించింది.

అంతా రిటర్నింగ్ అధికారి ముందే..

ప్రతి వీవీప్యాట్​లో పార్టీ సింబల్స్​ను స్టోర్ చేసే 4 మెగా బైట్ ఫ్లాష్ మెమరీ ఉంటుందని కోర్టుకు ఈసీ తెలిపింది. ‘‘రిటర్నింగ్ ఆఫీసరే ఎలక్ట్రానిక్ బ్యాలెట్​ను సిద్ధం చేస్తారు. ఆయన సమక్షంలోనే పార్టీ సింబల్స్ లోడింగ్ యూనిట్​లోకి లోడ్ చేస్తారు. అందులో సీరియల్ నంబర్, అభ్యర్థి పేరు, గుర్తు ఉంటుంది. ఏదీ ముందుగా లోడ్​చేసి ఉండదు’’అని చెప్పింది. మాక్ పోలింగ్ పూర్తయ్యాకే ఈవీఎం, వీవీప్యాట్​లు పోలింగ్ కేంద్రానికి వెళ్తాయని, పోలింగ్ రోజు కూడా పార్టీల ఏజెంట్ల ముందు చెక్ చేస్తామని కోర్టుకు వివరించింది.