ఉచిత వాగ్దానాలు చేసినా ఓడిపోతున్నాయి కదా

ఉచిత వాగ్దానాలు చేసినా ఓడిపోతున్నాయి కదా
  • రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని చెప్పలేం
  • ప్రజా ధనాన్ని సరైన రీతిలో ఖర్చు చేయడమే ప్రధాన అంశం
  • ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత
  • సుప్రీంకోర్టు ధర్మాసనం 

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల ఉచిత హామీ పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా రాజకీయ పార్టీలను తాము అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని.. ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో ఖర్చుచేయడమే ప్రధాన అంశమని తెలిపింది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచిత హామీలు ఇవ్వకుండా నిరోధించాలంటూ లాయర్ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ విచారించింది. 
విచారణ సందర్భంగా ఉచితం అనే పదాన్నే నిర్వచించాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకం, ఉచిత తాగునీరు, విద్య, వైద్య సదుపాయాలను ఉచితాలుగా చూడలేమని పేర్కొన్నారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయానికి ఉచిత హామీలే కారణమని చెప్పలేమన్నారు. ఉచిత వాగ్దానాలు చేసినా ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రస్తావించారు. వాదనల అనంతరం ఉచిత హామీలపై ఆగస్టు 20లోగా సూచనలు దాఖలు చేయాలని రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.