అత్యాచార​ కేసులో నిందితుల విడుదలపై సుప్రీంకోర్టు వివరణ

అత్యాచార​ కేసులో నిందితుల విడుదలపై సుప్రీంకోర్టు వివరణ
  • స్పష్టమైన ఆధారాలు చూపలేదు..
  • ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద నిర్దోషులుగా ప్రకటించినట్లు వెల్లడి
  • కోర్టుకు ఇంకో అవకాశం లేకపోయిందని కామెంట్

న్యూఢిల్లీ: 2012 నాటి కేసు.. ఓ యువతిని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత కారు పనిముట్లు, గ్లాస్ బాటిళ్లు, ఇనుప వస్తువులతో దారుణంగా కొట్టి చంపారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన ఘటన ఇది. ఈ కేసులో అరెస్టయి, ఉరిశిక్ష పడ్డ ముగ్గురు నిందితులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన బెంచ్ సోమవారం 40 పేజీలతో కూడిన ఉత్తర్వులను జారీ చేసింది. నిందితులకు వ్యతిరేకంగా డీఎన్‌‌ఏ ప్రొఫైలింగ్, కాల్ రికార్డులు సహా ముఖ్యమైన, బలమైన, స్పష్టమైన సాక్ష్యాలను చూపడంలో ప్రాసిక్యూషన్‌‌ ఫెయిలైందని చెప్పింది. ‘‘నిందితుల అరెస్టుకు సంబంధించిన సాక్ష్యం.. వారి గుర్తింపు.. నిందితులు ఉపయోగించిన వస్తువుల గుర్తింపు, రికవరీ.. కారు గుర్తింపు, సీజ్‌‌.. శాంపిల్స్ సేకరణ.. మెడికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్.. డీఎన్‌‌ఏ ప్రొఫైలింగ్ రిపోర్ట్, కాల్ రికార్డులకు సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాధారాలను ప్రాసిక్యూషన్‌‌ చూపలేకపోయింది. అభియోగాలను నిరూపించడంలో ఫెయిల్ అయింది. దీంతో చాలా ఘోరమైన నేరంలో నిందితులుగా ఉన్నప్పటికీ వారిని నిర్దోషులుగా ప్రకటించడం తప్ప కోర్టుకు ఇంకో అవకాశం లేకపోయింది” అని అందులో చెప్పుకొచ్చింది.

విచారణలో లోపాలు

‘‘ఘోరమైన నేరంలో భాగమైన నిందితులను శిక్షించకుండా వదిలేయడం వల్ల.. సొసైటీలో వేదన కలగొచ్చు. బాధిత కుటుంబం బాధపడొచ్చు. కానీ నైతిక నేరారోపణలు లేదా అనుమానంతో నిందితులను శిక్షించడానికి చట్టం అనుమతించదు” అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. విచారణ సమయంలో తాము లోపాలను గమనించినట్లు చెప్పింది. ‘‘10 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్ క్రాస్ ఎగ్జామిన్ చేయలేదు. ముఖ్యమైన సాక్ష్యులను డిఫెన్స్ లాయర్ సరిగ్గా క్రాస్ ఎగ్జామిన్ చేయలేదు. అసలు నిజాన్ని ట్రయల్ కోర్టు రాబట్టలేకపోయింది. అందుకే ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం” అని వివరించింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని స్పష్టం చేసింది.