ట్రయల్ కోర్టు జడ్జిలు రిస్క్ తీస్కోవట్లే: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

ట్రయల్ కోర్టు జడ్జిలు రిస్క్ తీస్కోవట్లే: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్

బెంగళూరు:  కీలకమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో ట్రయల్  కోర్టు జడ్జిలు రిస్క్ ఎందుకని బెయిల్ ఇవ్వకుండా తిరస్కరిస్తున్నారని సుప్రీంకోర్టు చీఫ్  జస్టిస్  డీవై చంద్రచూడ్  అన్నారు. ప్రతి కేసునూ పూర్తిగా పరిశీలించే సెన్స్  కలిగి ఉండాలని ట్రయల్   కోర్టుల జడ్జిలకు సూచించారు. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన బెర్క్ లీ సెంటర్  11వ వార్షిక సమావేశంలో సీజేఐ మాట్లాడారు. ‘‘ట్రయల్  కోర్టుల్లో బెయిల్  పొందాల్సిన వాళ్లకు బెయిల్  దొరకడం లేదు.

దీంతో నిందితులు హైకోర్టును, ఆ తర్వాత చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎలాంటి వారంట్  లేకుండా అరెస్టయిన వారి (ఆర్బిట్రరీ అరెస్టు) కేసుల్లో జాప్యం పెరుగుతున్నది. ట్రయల్  కోర్టుల మీద ప్రజలకు విశ్వాసం ఉండేలా చూడాలి. బెయిల్  పొందాలనుకుంటున్న వారి కేసును ట్రయల్  కోర్టులు విచారణ చేయాలి. దురదృష్టవశాత్తు అలా జరగడం లేదు. కీలకమైన కేసుల్లో బెయిల్  ఇవ్వకుండా ట్రయల్  కోర్టు జడ్జిలు సేఫ్ గా ఉండాలనుకుంటున్నారు” అని సీజేఐ వ్యాఖ్యానించారు.

అయితే, జడ్జిలు ప్రతి కేసును నిశితంగా పరిశీలించాలని, కేసు గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. చేట నుంచి రాళ్లను వేరు చేస్తేనే, సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. చాలా కేసులు సుప్రీంకోర్టు దాకా రాకుండా చూడాల్సిందని ఆయన పేర్కొన్నారు.