ప్రైవేట్ ఆస్తి సమాజ వనరు కాదనలేం: సుప్రీం

ప్రైవేట్ ఆస్తి సమాజ వనరు కాదనలేం: సుప్రీం

 న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్తులను సమాజ ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వం టేకోవర్ చేయరాదన్న వాదన ప్రమాదకరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్ ఆస్తులను కూడా సమాజ భౌతిక వనరులుగానే భావించాలని అభిప్రాయపడింది. ప్రభుత్వానికి ప్రైవేట్ ఆస్తులపై నియంత్రణ ఉండదన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చని తేల్చిచెప్పింది. ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి మహారాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్ట సవరణపై కొనసాగుతున్న మూడు దశాబ్దాల నాటి కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని 9 మంది జడ్జిల బెంచ్ బుధవారం విచారించింది. 

ఈ సందర్భంగా సీజేఐ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ముందుగా ముంబైకి చెందిన 20 వేల మంది ల్యాండ్ ఓనర్లతో కూడిన ప్రాపర్టీ ఓనర్స్ అసోసియేషన్ (పీవోఏ), మరో 15 మంది పిటిషనర్ల తరఫున అడ్వకేట్లు వాదిస్తూ.. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను పేర్కొంటున్న ఆర్టికల్ 39(బీ), ఆర్టికల్ 31(సీ)లను సాకుగా చూపుతూ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం సరికాదన్నారు. అయితే, ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం ప్రభుత్వ వనరులను మాత్రమే సమాజ వనరులుగా పరిగణించాలనడం సరికాదని చెప్పింది. 

‘‘సమాజంలో పరివర్తన తేవాలన్నది రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం. ఒక ఆస్తి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆ ఆస్తికి ఆర్టికల్ 39(బీ) వర్తించదని చెప్పలేం. సమాజ సంక్షేమం కోసం సంపద పున:పంపిణీ జరగాల్సిన అవసరం ఉంది” అని సీజేఐ బెంచ్ అభిప్రాయపడింది. ఆస్తులు వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పటికీ, అవి వారి భవిష్యత్తు తరాలకు, సమాజానికి చెందిన ఉమ్మడి సంపదగానే భావించాలని, అందువల్ల ప్రైవేట్ ఆస్తులు ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి రావనడం సరికాదని తెలిపింది. 

మధ్యస్తంగా మన ప్రాపర్టీ విధానం.. 

జమీందారీ వ్యవస్థ రద్దును కూడా ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. అలాగే మన ప్రాపర్టీ విధానం అనేది.. ఎక్స్ ట్రీమ్ సోషలిస్టిక్ గా గానీ, ఎక్స్ ట్రీమ్ క్యాపిటలిస్టిక్ గా గానీ కాకుండా మధ్యస్తంగా ఉందన్న విషయాన్ని గమనించాలన్నారు. అయితే, ప్రైవేట్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చా? లేదా? అన్నది.. శిథిలావస్థలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పించే మహారాష్ట్ర చట్ట సవరణ అంశం 
రెండూ వేర్వేరని సీజేఐ బెంచ్ తేల్చిచెప్పింది.