7 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్​లు

7 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్​లు

 

  • సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం
  • జమ్మూకాశ్మీర్ హైకోర్టు సీజేగా జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ 
  • గతంలో తెలంగాణ హైకోర్టు జడ్జిగా జస్టిస్ కైత్ విధులు 
  • హిమాచల్ హైకోర్టు సీజే జస్టిస్ రామచంద్రారావు
  • జార్ఖండ్​కు బదిలీ


న్యూఢిల్లీ: ఏడు హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ ల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ అండ్ లడఖ్, కేరళ, మధ్యప్రదేశ్, మద్రాస్, మేఘాలయ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్​ల పేర్లను ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్​తో కూడిన కొలీజియం రెకమండ్ చేసింది. న్యాయమూర్తుల సీనియారిటీ, పనితీరు, ప్రస్తుత అవసరాల వంటి అంశాలను పరిశీలించిన తర్వాత ఆయా హైకోర్టులకు వారిని చీఫ్ జస్టిస్​లుగా నియమించాలని రెకమండ్ చేసినట్టు పేర్కొంది. ఢిల్లీ హైకోర్టులో సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ సురేశ్ కుమార్ కైత్​ను జమ్మూకాశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు చీఫ్ జస్టిస్​గా నియమించాలని సూచించింది. జమ్మూకాశ్మీర్ హైకోర్టు సీజేగా ఉన్న ఎన్.కోటీశ్వర్ సింగ్ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందడంతో ఆయన స్థానంలో జస్టిస్ సురేశ్ కుమార్ ను కొలీజియం సిఫారసు చేసింది. ఎస్సీ కేటగిరీకి చెందిన జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ గతంలో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పని చేశారు. 2016 నుంచి రెండేండ్ల పాటు తెలంగాణ హైకోర్టు జడ్జిగా విధులు నిర్వర్తించిన అనంతరం తిరిగి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఎంఎస్ రామచంద్రా రావు జార్ఖండ్ హైకోర్టు సీజేగా ట్రాన్స్​ఫర్ అయ్యారు. ప్రస్తుతం జార్ఖండ్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి ఈ నెల 19న రిటైర్ కానున్న నేపథ్యంలో ఆయన స్థానంలో జస్టిస్ రామచంద్రా రావు అపాయింట్ అయ్యారు. అలాగే హిమాచల్ హైకోర్టు సీజేగా అదే హైకోర్టులోని సీనియర్ జడ్జి జస్టిస్ రాజీవ్ షఖ్దర్ పేరును కొలీజియం ఎంపిక చేసింది. హైదరాబాద్​కు చెందిన జస్టిస్ రామచంద్రారావు 2021లో తెలంగాణ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ ​జస్టిస్​గా పని చేశారు.   

ఇతర సీజేలుగా వీరే.. 

ఢిల్లీ హైకోర్టు యాక్టింగ్ సీజేగా ఉన్న జస్టిస్ మన్మోహన్​ను అదే హైకోర్టుకు చీఫ్ జస్టిస్​గా అపాయింట్ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్న జస్టిస్ జీఎస్ సంధావాలియాను కూడా అదే హైకోర్టుకు సీజేగా నియమించాలని పేర్కొంది. కేరళ హైకోర్టు సీజేగా జస్టిస్ నితిన్ మధుకర్ జమ్ దార్, మేఘాలయ హైకోర్టు సీజేగా జస్టిస్ తషి రబ్​స్తాన్ పేర్లను సూచించింది. లడఖ్​కు చెందిన జస్టిస్ తషి రబ్​స్తాన్ ఇప్పటివరకూ జమ్మూకాశ్మీర్ హైకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్నారు. మేఘాలయ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఎస్.వైద్యనాథన్ వచ్చే నెల 16న రిటైర్ కానున్న నేపథ్యంలో ఆయన స్థానంలో జస్టిస్ తషి ఎంపికయ్యారు. మద్రాస్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సంజీవ్ వి.గంగాపూర్ వాలా రిటైర్ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో జస్టిస్ కేఆర్ శ్రీరామ్ పేరును కొలీజియం రెకమండ్ చేసింది. జస్టిస్ కేఆర్ శ్రీరామ్ ఇప్పటివరకు బాంబే హైకోర్టులో సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్నారు. ఇక ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్​ను జమ్మూకాశ్మీర్ హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేయాలని కొలీజియం పేర్కొంది.