
- కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.. మొత్తం 6 రాష్ట్రాల హైకోర్టులకు జడ్జీల నియామకం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ హైకోర్టుకు త్వరలో నలుగురు కొత్త జడ్జీలు రానున్నారు. ఈ నెల 2వ తేదీన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం అడ్వకేట్లుగా సేవలు అందిస్తున్న గౌస్ మీర మోహిద్దీన్, చలపతిరావు సుద్దాల, వాకిటి రామకృష్ణా రెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ ను జడ్జీలుగా ప్రమోట్ చేస్తూ తెలంగాణ హైకోర్టుకు కేటాయించింది. తెలంగాణతో పాటు ఏపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ – హర్యానా హైకోర్టులకు పలువురు కొత్త జడ్జీలకు అవకాశం కల్పించింది.
ఇందులో అడ్వకేట్ తుహిన్ కుమార్ను ఏపీ హైకోర్టు జడ్జీగా కొలిజీయం సిఫార్సు చేసింది. జ్యుడీషియల్ ఆఫీసర్లు శైల్ జైన్, మధు జైన్ ను ఢిల్లీ హైకోర్టు జడ్జీలుగా నియమించింది. అడ్వకేట్ అనురూప్ సింఘీ, జ్యుడీషియల్ ఆఫీసర్ సంగీత శర్మ ను రాజస్థాన్ హైకోర్టుకు, జ్యుడీషియల ఆఫీసర్లు రాజేశ్ కుమార్ గుప్తా, అలోక్ అవస్థీ, ఆర్సీ సింగ్ బైసెన్, బీపీ శర్మ, ప్రదీప్ మిట్టల్ ను మధ్యప్రదేశ్ హైకోర్టుకు
కేటాయించింది.
అత్యధికంగా 10 మంది జ్యుడీషియల్ ఆఫీసర్లను పంజాబ్–హర్యానాకు సిఫార్సు చేస్తూ సుప్రీంకోర్టు కొలిజియం నిర్ణయం తీసుకున్నది. ఇందులో వీరిందర్ అగర్వాల్, మణిదీప్ పన్ను, ప్రమోద్ గోయల్, షాలిని సింగ్ నాగ్ పాల్, అమరీందర్ సింగ్ గ్రీవల్, సుభాష్ మెహ్లా, సూర్య ప్రతాప్ సింగ్, రుపీందర్ జిత్ చాహల్, ఆరాధన సాహ్ని, యశ్వీర్ సింగ్ రాథోడ్లు ఉన్నారు. కాగా.. ఈ సిఫార్సులను కేంద్ర న్యాయ శాఖ పరిశీలించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నది. రాష్ట్రపతి ద్రౌపది ఆమోదం తర్వాత వీరంతా జడ్జీలుగా ప్రమాణం చేస్తారు.