సుప్రీంకోర్టు బెంచ్ కీలక కామెంట్స్
సుప్రీం బెంచ్ కామెంట్స్
కులాల మధ్య తేడాలు తొలగిపోతే మంచిదే.
పెద్ద కులాలు, కింది కులాల
మధ్య పెళ్లిళ్లు జరగాలి.
ఇలాంటి పెళ్లిళ్లు వల్ల సోషలిజానికి కూడా మంచిదే.
న్యూఢిల్లీ: వేర్వేరు మతాలు, కులాల మధ్య జరిగే పెళ్లిళ్ళకు తాము వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది. ఈ పెళ్లిళ్ల వల్ల ‘సోషలిజం’ బలపడుతుందని తెలిపింది. చట్ట ప్రకారం ఒకర్నొకరు పెళ్లి చేసుకుంటే సమస్యలు ఎందుకుంటాయని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. తన కూతురు వేరే మతానికి చెందిన అబ్బాయిని పెళ్లిచేసుకుందంటూ చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ తండ్రి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ కేసు విచారణ సందర్భంగా బెంచ్‌లోని జడ్జిలు ఈ కీలక కామెంట్స్ చేశారు.
చత్తీస్‌గఢ్ కేసులో ముస్లిం యువకుడు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆమె పాటిస్తున్న హిందు మతంలోకి మారాడు. ఈ పెళ్లికి అభ్యంతరం చెబుతూ అమ్మాయి తండ్రి రాష్ట్ర హైకోర్టులో కేసు వేశాడు. ఇద్దరూ కలిసి జీవించవచ్చని హైకోర్టు తీర్పుచెప్పింది. ఈ తీర్పును ఆ అమ్మాయి తండ్రి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఈ పెళ్లి వెనక ఒక పెద్ద రాకెట్ (ముఠా) నడుస్తోందని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. పిటిషనర్ తరపున సీనియర్ ఆడ్వొకేట్ ముకుల్ రోహత్గి వాదించారు.
కేరళలోని హదియా కేసును ప్రస్తావిస్తూ ఆమె పెళ్లిపై విచారణ అవసరం లేదని అబ్బాయి తరపు లాయర్ రాకేశ్ ద్వివేది, అమ్మాయి తరపు లాయర్ గోపాల్ శంకర్‌నారాయణ్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. దంపతుల తరపు లాయర్ల వాదనలు విన్న జడ్జిలు.. ఈ పెళ్లిపై విచారణ జరపబోమని చెప్పారు. అమ్మాయి ప్రయోజనాలను పరిరక్షించాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని అన్నారు. కేసు తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
