Supreme Court: ఇదో ఇంట్రస్టింగ్ విడాకుల కేసు.. ఇంతకు ముందెప్పుడు విని ఉండరు..!

Supreme Court: ఇదో ఇంట్రస్టింగ్ విడాకుల కేసు.. ఇంతకు ముందెప్పుడు విని ఉండరు..!

న్యూఢిల్లీ: విడాకుల కేసుల్లోనే ఆసక్తికర తీర్పును సుప్రీం కోర్టు వెల్లడించింది. పెళ్లయ్యాక భర్తతో కేవలం 23 రోజులు మాత్రమే కలిసి ఉండి, 22 ఏళ్ల తర్వాత అతనిపై తప్పుడు కేసులు బనాయించిన భార్యకు సర్వోన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. భార్యకు ఎటువంటి భరణం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసి సదరు భర్తకు సుప్రీం కోర్టు విడాకులు మంజూరు చేసింది. అందువల్లే.. విడాకుల కేసుల్లోనే ఇదో అరుదైన తీర్పుగా మిగిలిపోయింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. విడాకులు తీసుకున్న ఈ భార్యాభర్తలిద్దరూ సమాజంలో పేరుమోసిన వైద్యులు. 2002లో వీరిద్దరికీ వివాహం జరిగింది. అప్పటికే ఇద్దరూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. కారణమేంటో తెలియదు గానీ.. పెళ్లయి నెల రోజులు కూడా అవ్వకముందే, 23 రోజులకే భర్తకు దూరంగా భార్య వెళ్లిపోయింది. ఆమెను తిరిగి తన దగ్గరకు తీసుకొచ్చేందుకు భర్త ప్రయత్నించినా సదరు భార్య తిరిగి రాలేదు. హిందూ వివాహ చట్టం ప్రకారం తన బాధ్యతను భర్త చూసుకోవాలని ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు ఆమె పిటిషన్ ను తిరస్కరించింది. భార్య తీరుతో విసిగిపోయిన భర్త.. విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. 

భర్త విడాకులు కోరుతూ నోటీసులు పంపడంతో కోపంతో రగిలిపోయిన ఆమె 125, 498ఏ చట్టం కింద భర్తపై, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. భర్త, అతని తల్లి, తండ్రి, సోదరుడు, సోదరిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ పై అందరూ బయటికొచ్చారు. భర్త కుటుంబ సభ్యులను కోర్టు విడుదల చేసింది. కుటుంబ సభ్యులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ భార్య కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. 2006లో ఫ్యామిలీ కోర్టు భర్తకు విడాకులు మంజూరు చేసింది.

Also Read:ఆంధ్రా అల్లుడు.. అమెరికా ఉపాధ్యక్ష రేసులో.. ఎవరంటే..?

విడాకులు మంజూరు చేయడంపై భార్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీల్ కు వెళ్లింది. భార్యకు విడాకులు ఇష్టం లేకపోవడంతో ఫ్యామిలీ కోర్టు తీర్పు చెల్లదని హైకోర్టు.. ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్ ఈ కేసును విచారించింది. ఇరు పక్షాల వాదనలు విని నిజానిజాలను పరిశీలించిన అనంతరం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ఇచ్చే ప్రత్యేక అధికారంతో సుప్రీం కోర్టు బెంచ్ తీర్పును వెల్లడించింది. ఈ కేసులో పిటిషనర్లు ఇద్దరూ వృత్తిరీత్యా పేరున్న వైద్యులు కావడంతో ఆర్థికంగా ఇద్దరూ స్థితిమంతులేనన్న విషయాన్ని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. అందువల్ల.. ఎలాంటి భరణం చెల్లించాల్సిన అవసరం లేకుండానే భర్తకు విడాకులు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.