
పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలుచేయకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాదాపు 60 పిటిషన్లు నమోదయ్యాయి. అయితే ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం.. పౌరసత్వ సవరణ చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. CAA అమలుపై తగిన వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. జనవరి రెండో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 22కు వాయిదా వేసింది. దాఖలయిన పిటిషన్లు అన్నింటిపై ఒకేసారి విచారిస్తామని సుప్రీం తెలిపింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఇప్పటివరకు దాదాపు 60 పిటిషన్లు దాఖలయ్యాయి. విపక్ష పార్టీలతో పాటు కొన్నిముస్లిం సంఘాలు, కొందరు నేతలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించింది. చట్టం అమలుపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా దానికి ధర్మాసనం నిరాకరించింది.