ఓటుకు నోటు కేసులో రేవంత్​కు చుక్కెదురు.. పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

ఓటుకు నోటు కేసులో రేవంత్​కు చుక్కెదురు.. పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
  • ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిటిషన్ డిసెంబర్ 4 తర్వాత విచారణ

న్యూఢిల్లీ, వెలుగు:  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసులో ఎంపీ రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ వ్యవహారంలో ఐదుగురు సాక్షుల్ని ఒకేసారి క్రాస్‌‌‌‌ ఎగ్జామినేషన్‌‌‌‌ చేయాలని, ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ రెండు వేరు వేరు పిటిషన్లను రేవంత్ రెడ్డి దాఖలు చేశారు. 

మంగళవారం ఈ పిటిషన్లపై జస్టిస్‌‌ సంజీవ్‌‌ ఖన్నా, జస్టిస్‌‌ ఎస్‌‌వీఎన్‌‌ భట్టిల ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత పిటిషన్ బెంచ్ ముందుకు రాగా.. రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది పాస్ ఓవర్ కోరారు. అనంతరం మరోసారి కేసు విచారణకు రాగా.. జస్టిస్ సంజీవ్‌‌ ఖన్నా పిటిషన్ల వారీగా వాదనలు వినిపించాలని కోరారు. తొలుత సాక్షుల విచారణపై రేవంత్​రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు కొనసాగించారు. మధ్యలో జస్టిస్ సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని సాక్షులను ఎలా విచారించాలన్న దానిపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటాయని ప్రశ్నించారు.

 ప్రస్తుతం సాక్షుల విచారణ అంశంపై దాఖలైన పిటిషన్ హైకోర్టులో పెండింగ్​లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్ ను కొట్టివేశారు. ‘ఓటుకు నోటు’ కేసు విచారణ ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదంటూ వేసిన మరో పిటిషన్ ను సైతం బెంచ్ కొట్టేసింది. అలాగే ఈ అంశంలో మెరిట్స్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా.. ఈ కేసు నుంచి తనను తప్పించాలంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌‌ను డిసెంబర్ 4 తర్వాత విచారిస్తామని బెంచ్​పేర్కొంది.