సమయం వృథా చేశారంటూ యూపీ సర్కారుకు సుప్రీం జరిమానా

సమయం వృథా చేశారంటూ యూపీ సర్కారుకు సుప్రీం జరిమానా

ఓ కేసుకు సంబంధించి 5వందల రోజులకు పైగా ఆలస్యంతో అప్పీల్‌ పిటీషన్‌ వేయడంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు యోగి ప్రభుత్వానికి రూ.15 వేల జరిమానా విధించింది. ఫైల్‌ తేదీలను పరిశీలించే కనీస మర్యాద కూడా ప్రభుత్వానికి లేదని జస్టిస్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. ‘ప్రత్యేక లీవ్‌ పిటిషన్‌ 576 రోజుల ఆలస్యమయింది. ఫైల్స్‌ కదలికలో తేదీల చూసే మర్యాద కూడా లేదు. ఆలస్యానికి బాధ్యులైన వారి గుర్తించి, వారి నుంచి నగదును రికవరీ చేయండి’ అంటూ ధర్మాసనం ఆదేశించింది. పిటిషన్‌ ఆలస్యంగా వేసిన కారణంగా ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని.. అలాగే న్యాయవ్యవస్థ సమయాన్ని వృథా చేసినందుకు సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ అన్‌ రికార్డ్‌ వెల్ఫేర్‌ ఫండ్‌లో రూ.15 వేలు డిపాజిట్‌ చేయాలని ధర్మాసనం ఇటీవలి తీర్పులో స్పష్టం చేసింది.

2018 అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఈ నెలలో యూపీ ప్రభుత్వం అప్పీల్‌ పిటిషన్‌ వేయడంపై సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించింది. ఒక వ్యక్తి ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించాలని అలహాబాద్‌ హైకోర్టులోని సింగిల్‌ జడ్జి ధర్మాసనం అప్పట్లో తీర్పు ఇచ్చింది.