కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ పై సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ దే తుది నిర్ణయమని చెప్పింది. స్పీకర్ అధికారాలను తక్కువ చేయలేమని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే.. రాజీనామాల ఆమోదానికి టైం ఫిక్స్ చేయలేమని చెప్పింది సుప్రీంకోర్టు. ఇక.. రేపు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్ష యథాతథంగా జరుగుతుందన్న కోర్టు.. దీనికి ఎమ్మెల్యేలు హాజరు కావాలని బలవంతం చేయొద్దని చెప్పింది. అసెంబ్లీకి రావాలా..? వద్దా..? అనేది రెబల్ ఎమ్మెల్యేల ఇష్టమని చెప్పింది కోర్టు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో సంకీర్ణ సర్కారుకు ఇబ్బందులు తప్పేలా లేవు. రేపు అసెంబ్లీలో విశ్వాసపరీక్ష ఉంది. ఈ సమయంలో ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించినా.. వారిపై అనర్హత వేటు వేసినా.. సంకీర్ణ సర్కారుకు ఇబ్బందే. ప్రభుత్వ బలం పడిపోతే.. బీజేపీ బలం పెరగనుంది. ప్రస్తుతం 118గా ఉన్న ప్రభుత్వ బలం.. ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే 100కు పడిపోతుంది. అటు బీజేపీకి ప్రస్తుతం 105 మంది సభ్యులున్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. దీంతో బీజేపీ బలం 107కు చేరుతుంది. అలాంటప్పుడు విశ్వాసపరీక్షలో కాంగ్రెస్, జేడీఎస్ సర్కారు ఓడిపోక తప్పదని తెలుస్తోంది.
