సైన్యంలో మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ కరెక్టే..వారిపై వివక్ష సరికాదు

సైన్యంలో మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ కరెక్టే..వారిపై వివక్ష సరికాదు
  • సైన్యంలో మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ కరెక్టే
  • వారిపై వివక్ష సరికాదంటూ సుప్రీం చరిత్రాత్మక తీర్పు
  • వారిపై వివక్ష సరికాదంటూ సుప్రీం చరిత్రాత్మక తీర్పు
  • బలగాల్లో వేకెన్సీలు పురుషులకే అనుకోవడం కరెక్టు కాదు 
  • మహిళా ఆఫీసర్లకూ అవకాశాలు ఇవ్వాలని సూచన

న్యూఢిల్లీ: దేశ సాయుధ బలగాల్లో లింగ సమానత్వాన్ని బలోపేతం చేసేలా సుప్రీంకోర్టు మంగళవారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. షార్ట్  సర్వీస్  కమిషన్ (ఎస్ఎస్ సీ) మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్  కమిషన్ ఇవ్వాల్సిందేనని, అది కరెక్టేనని కోర్టు పేర్కొంది. ఎస్ఎస్ సీ మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్  కమిషన్ ను తిరస్కరించడం వివక్ష కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. వారికి పూర్తిగా న్యాయం చేయడానికి ఆర్టికల్ 142ను వాడుతున్నామని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్  భూయాన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్​తో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్​ను తిరస్కరించడంపై దాఖలైన పిటిషన్​ను బెంచ్  విచారించింది. ‘‘ఎస్ఎస్ సీ మహిళా ఆఫీసర్లకు ఇచ్చిన పర్మనెంట్ కమిషన్​ను డిస్టర్బ్ చేయకూడదు. సాయుధ బలగాల నియామక ప్రక్రియలో మహిళలు కూడా పురుషులలాగే అన్ని రకాల పరీక్షలు పాసయ్యారు. సమాన అవకాశాలు ఇవ్వకపోవడంతో వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. సాయుధ బలగాల్లో వేకెన్సీలు పురుషులకే ఉండాలని పురుష అధికారులు భావించరాదు. అలాగే, పర్మనెంట్  కమిషన్  పురుషులకే పరిమితం అవుతుందనుకోవడం కూడా కరెక్టు కాదు. శాశ్వత కమిషన్​ నిరాకరించడం వ్యవస్థలో పాతుకుపోయిన వివక్షకు నిదర్శనం” అని బెంచ్  వ్యాఖ్యానించింది.

250 నిబంధన  ఎత్తివేత

 ఏటా 250 మంది ఎస్ఎస్ సీ మహిళా ఆఫీసర్లను మాత్రమే పర్మనెంట్  కమిషన్ లోకి తీసుకోవాలన్న పరిమితిని ఎత్తివేస్తున్నామని బెంచ్  తెలిపింది. ఈ నిర్ణయంతో పురుష అధికారులతో సమానంగా మహిళా ఆఫీసర్లు కూడా ప్రమోషన్లు  పొందుతారని బెంచ్  పేర్కొంది. మహిళా ఆఫీసర్ల పనితీరు, అర్హతలను పరిశీలనలోకి తీసుకొని యాన్యువల్  కాన్ఫిడెన్షియల్  రిపోర్టును ఎప్పుడూ రూపొందించలేదని, దీంతో ఆ మహిళా అధికారులపై ప్రతికూల ప్రభావం పడిందని బెంచ్ వ్యాఖ్యానించింది. వైమానిక దళంలో 2019లో ప్రవేశపెట్టిన కనీస పనితీరు ప్రమాణాలను హడావుడిగా అమలు చేశారని బెంచ్ సీరియస్  అయింది.