జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర‌కు సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్

జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర‌కు సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్

ఒడిశాలో అత్యంత వైభ‌వంగా జ‌రిగే పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌ను క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో నిలిపేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని వెన‌క్కి తీసుకుంది. స్థానికుల‌తో మాత్ర‌మే ర‌థ‌యాత్ర నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని సోమ‌వారం తాజాగా తీర్పు ఇచ్చింది. ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ర‌థ‌యాత్ర నిర్వ‌హించాలా వ‌ద్దా అన్న విష‌యాన్ని ఒడిశా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకునే స్వేచ్ఛ క‌ల్పిస్తున్న‌ట్లు ధ‌ర్మాస‌నం తెలిపింది. ర‌థ‌యాత్ర‌లో ల‌క్ష‌లాది భ‌క్తులు పాల్గొనే అవ‌కాశం ఉందని, దీనికి అనుమ‌తి ఇస్తే వైర‌స్ ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉంద‌ని, ఈ వేడుక‌ను నిలిపేయాల‌ని గ‌త గురువారం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే వంద‌ల ఏళ్లుగా వ‌స్తున్న సంప్ర‌దాయాన్ని అడ్డుకోవ‌ద్ద‌ని, ఆ తీర్పుపై రివ్యూ చేయాల‌ని కోరుతూ 21 మంద‌ది పిటిష‌న‌ర్లు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. దీంతో వాటిపై ఇవాళ విచార‌ణ చేపట్టింది. దీనిపై పిటిష‌నర్ల‌తో పాటు సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వాద‌న‌లు వినిపించారు. పూరీ జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర‌ కోట్ల మంది భ‌క్తుల న‌మ్మ‌కానికి సంబంధించిన అంశ‌మ‌ని, శ‌తాబ్ధాలుగా వ‌స్తున్న సంప్ర‌దాయాన్ని అడ్డుకోవ‌ద్ద‌ని తుషార్ మెహ‌తా కోరారు. కరోనా దృష్ట్యా ఈసారి ప్రజలు లేకుండానే నిర్వహించేందుకు అనుమతించాలని కోరారు. క‌రోనా టెస్టులు చేసిన అనంత‌రం నెగ‌టివ్ వ‌చ్చిన వాళ్లు మాత్ర‌మే జ‌గ‌న్నాథుడి ఆల‌యంలో ప‌ని చేస్తున్న‌ట్లు తెలిపారు. సంప్ర‌దాయం ప్ర‌కారం రేపు (జూన్ 23న‌) ర‌థ‌యాత్ర‌లో పూరీ జ‌గ‌న్నాథుడు బ‌య‌ట‌కు రాకుండే మ‌రో 12 ఏళ్ల పాటూ రాకూడ‌ద‌ని కోర్టుకు వివ‌రించారు. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కోట్లాది భ‌క్తుల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా ఉండేలా స్థానికుల‌తో ర‌థ‌యాత్ర నిర్వ‌హించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారు. దీంతో క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌కుండా పూర్తి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, ఆల‌య క‌మిటీ అత్యంత జాగ‌రూక‌త‌తో ర‌థ‌యాత్ర‌ను నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. ప‌రిస్థితి చేయిదాపోయే ప్ర‌మాదం ఉంద‌నుకుంటే ఒడిశా రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌థ‌యాత్ర‌ను నిలిపేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని చెప్పింది.