
- నీట్ యూజీ ఎగ్జామ్ కేసులో ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం
- స్టూడెంట్ల పేర్లు కనిపించకుండా జాగ్రత్త పడండి
- రేపు మధ్యాహ్నం 12 గంటల వరకే డెడ్‌లైన్
- చాలా చోట్ల పేపర్ లీకైతే రీ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటది
- తీర్పు కోసం లక్షల మంది స్టూడెంట్లు ఎదురు చూస్తున్నరు
- ప్రశ్నపత్రం లీకైన మాట వాస్తవమే అని వెల్లడి
న్యూఢిల్లీ: నీట్ యూజీ ఎగ్జామ్ రిజల్ట్స్‌ను సిటీ, సెంటర్ల వారీగా మళ్లీ రిలీజ్ చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోపు ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని సూచించింది. రిజల్ట్స్‌లో ఎక్కడా స్టూడెంట్ల పేర్లు కనిపించొద్దని ఆదేశించింది. బిహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్లు తెలుస్తున్నదని చెప్పింది.
ఈ క్వశ్చన్ పేపర్ రెండు ఎగ్జామ్ సెంటర్లకే పరిమితమైందా? లేదా వేరే పరీక్షా కేంద్రాలు, దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అయ్యిందా? అనేది తెలుసుకోవాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది. అందుకే ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచడం కీలకమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ అభిప్రాయపడింది. నీట్ పేపర్ లీక్, గ్రేస్ మార్కులపై దాఖలైన పిటిషన్లపై గురువారం విచారణ జరిగింది.
ఈ నేపథ్యంలో బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘సెంటర్, సిటీ వైజ్ రిజల్ట్స్ ప్రకటిస్తే.. మార్క్ ప్యాటర్న్‌ను తెలుసుకోవచ్చు. అత్యధిక మార్కులు, మెరుగైన ర్యాంకులు ఏ సిటీ, ఏ సెంటర్లో ఎక్కువ వచ్చాయో తెలుస్తుంది. ఒకే సెంటర్ లేదంటే.. ఒకే సిటీలో ఎక్కువ మంది హై స్కోర్ సాధించి.. మెరుగైన ర్యాంకులు పొందితే.. అక్కడ పేపర్ లీక్ అయ్యిండొచ్చనే భావిస్తాం. ప్రాథమిక ఆధారాల ప్రకారం.. నీట్ పేపర్ పాట్నా, హజారీబాగ్‌కే పరిమితమైనట్లు కనిపిస్తున్నది. అలా అనీ.. గుజరాత్‌లో అలాంటిదేమీ జరగలేదని చెప్పలేం. అందుకే దేశవ్యాప్తంగా ఏ సిటీల్లో.. ఎక్కడెక్కడ ఎగ్జామ్ నిర్వహించారో తెలియాలి. దాని ప్రకారమే రిజల్ట్స్ వెబ్సైట్లో అందుబాటులోకి తేవాలి’’అని బెంచ్ తెలిపింది.
స్టూడెంట్ల మార్కులు.. వారి వ్యక్తిగత ఆస్తి
స్టూడెంట్స్‌కు వచ్చిన స్కోర్స్‌ను బహిర్గతం చేయాలని, అప్పుడే ఎన్టీఏపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పిటిషనర్ల తరఫు అడ్వకేట్ వాదించారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ఎగ్జామ్ స్కోర్ అనేవి స్టూడెంట్స్ వ్యక్తిగత ఆస్తి అని తెలిపారు. వాటిని ఎన్టీఏ బహిర్గతం చేయలేదని వివరించారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. స్టూడెంట్ల పేర్లు కనిపించకుండా.. మార్కులు వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించింది.
నీట్ వ్యవహారంలో ఫస్ట్ కేసు బిహార్‌లో రిజిస్టర్ అయ్యిందని, దీనికి కారణమైన ‘సాల్వార్ గ్యాంగ్’ జార్ఖండ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రలోనూ యాక్టివ్‌గా ఉందని తెలిపింది. మరింత సమాచారం అందజేయాలని బీహార్ పోలీసులను బెంచ్ ఆదేశించింది. కాగా, గురువారం విచారణలో భాగంగా ఎన్టీఏ సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సబ్మిట్ చేసింది. చాలా మంది స్టూడెంట్స్‌కు 550 నుంచి 720 మధ్య మార్కులు వచ్చాయని, దీని కి ప్రధాన కారణం.. సిలబస్ లో చేసిన మార్పులే అని ఐఐటీ మద్రాస్ అభిప్రాయపడింది.
ఈ విషయాన్ని అఫిడవిట్లో ఎన్టీఏ పేర్కొన్నది. 67 మందికి జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులు వచ్చాయి. వీరిలో ఆరుగురు స్టూడెంట్లు హర్యానా బహదూర్‌ఘర్ లోని ఒకే కోచింగ్ సెంటర్ కు చెందినవారని ఎన్టీఏ తెలిపింది.
మార్కుల కేటాయింపుల్లో తప్పులు జరగలే..
మార్కుల కేటాయింపులో మాత్రం ఎలాంటి తప్పులు జరగలేదని ఐఐటీ మద్రాస్.. తన నివేదికలో స్పష్టం చేసింది. క్వశ్చన్ పేపర్ల ట్రాన్స్పోర్టేషనే సరిగ్గా లేదని చెప్పింది. క్వశ్చన్ పేపర్లను ట్రాన్స్‌పోర్టేషన్‌లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పిటిషనర్ల తరఫు అడ్వకేట్ నరేందర్ హుడా వాదించారు. ‘‘క్వశ్చన్ పేపర్ల తరలింపులో ప్రొటోకాల్ పాటించలేదు.
ఏప్రిల్ 24న ప్రైవేట్ కొరియర్ ద్వారా పేపర్లను ఎగ్జాం సెంటర్లకు పంపారు. హజారీబాగ్ లోని ఓ స్కూల్‌కు పేపర్లు తీసుకెళ్తున్నప్పుడే లీక్ అయ్యిందని సీబీఐ తేల్చింది. ట్రంక్ పెట్టెలో క్వశ్చన్ పేపర్లను మే 3న హజారీబాగ్‌కు తరలించారు. ఈ రిక్షాలో ట్రంక్ పెట్టెను ట్రాన్స్‌పోర్టు చేసినట్టు తెలిసింది. అదే స్కూల్ ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది’’అని అన్నారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. ‘‘ప్రింటింగ్ ప్రెస్ నుంచి సెంటర్‌కు క్వశ్చన్ పేపర్ తీసుకెళ్లేదాకా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.
ట్రంక్ పెట్టెలకు సీల్ ఉంటుంది. జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. ఏడంచెల భద్రత ఉంటుంది’’అని తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘‘క్వశ్చన్ పేపర్ల తరలింపునకు ప్రైవేట్ కొరియర్‌ను వాడారా?”అని ప్రశ్నించింది. దీనిపై త్వరలోనే వివరాలు అందజేస్తామని తెలిపారు.
సీబీఐ అదుపులో నలుగురు పాట్నా ఎయిమ్స్ స్టూడెంట్లు
నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో గురువారం సీబీఐ అధికారులు నలుగురు పాట్నా ఎయిమ్స్ స్టూడెంట్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో వారిని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పాట్నా ఎయిమ్స్ డైరెక్టర్ బీజే పాల్ మీడియాతో మాట్లాడారు.
‘‘సీబీఐ అదుపులోకి తీసుకున్న నలుగురు స్టూడెంట్లు విచారణకు సహకరిస్తున్నరు. స్టూడెంట్లు చందన్ సింగ్, రాహుల్ అనంత్, కుమార్ షా, కరణ్ సీబీఐ అదుపులోనే ఉన్నారు. ముందుగా ఇన్‌స్టిట్యూట్‌కు సీబీఐ అధికారులు సమాచారం అందించారు. ఆ నలుగురిని వారి హాస్టల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వారి రూమ్‌లను అధికారులు సీజ్ చేశారు. ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, డీన్ సమక్షంలోనే సీబీఐ అధికారుల టీం ఆ స్టూడెంట్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నది’’అని తెలిపారు.