నిర్మాణ సంస్థలు మోసం చేస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి

నిర్మాణ సంస్థలు మోసం చేస్తే బ్లాక్ లిస్టులో పెట్టాలి


హైదరాబాద్, వెలుగు: కస్టమర్లను మోసం చేసే నిర్మాణ సంస్థలు, బిల్డర్లను నిషేధిత జాబితాలో పెట్టాలంటూ సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది. ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన జయభేరి నిర్మాణ సంస్థ వినియోగదారులను మోసం చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సేల్ డీడ్ లో పేర్కొన్న ప్రకారం మౌలిక వసతులు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. జయభేరి సంస్థపై నమోదైన కేసును మళ్లీ విచారించాల్సిందేనని చెప్పింది. దీంతో ఈ కేసు కింది కోర్టులో మరోసారి విచారణకు రానుంది.

అసలేమైందంటే..

2003లో కొండాపూర్ వద్ద ఉన్న జయభేరి సిలికాన్ కౌంటీలో బండ్రెడ్డి మధుసూదన్.. కారు పార్కింగ్‌తో కలిపి 3010 చదరపు అడుగల ఫ్లాట్ కొనుగోలు చేశారు. కామన్ ఏరియాలో ఉన్న క్లబ్ హౌజ్, ఎస్టీపీని వాడుకోవచ్చని సేల్ డీడ్ లో పేర్కొన్నారు. తర్వాత 3 వేల గజాల విస్తీర్ణంలోని క్లబ్ హౌజ్ స్థలాన్ని మరో నిర్మాణ సంస్థకు అమ్మేయడం, 18 వేల గజాల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరగకపోవడం, హెచ్ఎండీఏ రూల్స్‌ను అతిక్రమించడం వంటి వాటిపై 2008లో దుగ్గిరాల కిషోర్, మాగంటి రాంమోహన్, మురళీమోహన్‌లపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై మాదాపూర్ పోలీసులు చార్జ్‌షీటు దాఖలు చేశారు. పలుమార్లు విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. 2014లో బాధితుడు హైకోర్టుకెక్కాడు. ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ, సేల్ డీడ్ లో పేర్కొన్నట్లుగా మౌలిక వసతులు, సౌకర్యాలకు కట్టుబడి సేవలు అందించాల్సిందేనంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో స్పెషల్ లీవ్ పిటిషన్ తో నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును 2018లో ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈనెల 7 వరకు విచారణ కొనసాగింది. తాజాగా హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.. స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది. వినియోగదారులను మోసం చేసే నిర్మాణ సంస్థల విషయంలో కఠినంగా వ్యవహారించాలని, అవసరమైతే నిషేధించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.