
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జామియా ఆందోళనలపై సుప్రీం కోర్టు విచారించింది. నిన్నటి ఘటనను సుమోటోగా స్వీకరించాలని న్యాయవాది ఇందిరా జైసింగ్ సుప్రీంను కోరారు. ఇదీ పూర్తి స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనే అని తెలిపారు. సీజేఐ అరవింద్ బోబ్డే నేతృత్వంలోని బెంచ్ ముందు వివరాలు ఉంచారు. అయితే రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జీ ఈ కేసుపై విచారణ చేపట్టాలని మరో న్యాయవాది కొలిన్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి బోబ్డే… హక్కులను గౌరవిస్తాము… కానీ… అల్లర్లను సహించమన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత దీన్ని సుమోటోగా విచారిస్తామన్నారు. ప్రశాంతంగా నిరసన చేయడాన్ని తాము అడ్డుకోమన్నారు. అయితే రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించాలనుకోవటాన్ని తప్పుపట్టారు. ఘటనకు సంబంధించి కోర్టు వీడియోలు చూడదన్న…. సీజేఐ… హింస, ప్రజా ఆస్తి విధ్వంసం ఇలాగే కొనసాగితే… ఘటనపై ఎలాంటి వాదనలు వినమని పేర్కొన్నారు. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.