ప్రజాస్వామ్యం సఫలం కావాలంటే న్యాయవ్యవస్థ కీలకం

ప్రజాస్వామ్యం సఫలం కావాలంటే న్యాయవ్యవస్థ కీలకం

భారత రాజ్యాంగ వ్యవస్థలో న్యాయవ్యవస్థ అత్యంత కీలకమైనది. ప్రజాస్వామ్య వ్యవస్థ సఫలం కావాలంటే న్యాయవ్యవస్థ కీలకం. ఈ విషయాన్ని గుర్తించిన రాజ్యాంగ నిర్మాతలు ప్రజాస్వామ్య విలువలతో స్వతంత్ర న్యాయవ్యవస్థ ఏర్పాటు చేశారు.  భారత న్యాయవ్యవస్థ  ఏకీకృత సమగ్ర న్యాయవ్యవస్థ, స్వతంత్ర న్యాయశాఖ, ప్రాథమిక హక్కుల రక్షణ, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించడం లాంటి ప్రధాన లక్షణాలతో నిర్మితమైంది. రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయం,స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో భారత న్యాయవ్యవస్థ  కీలకపాత్ర పోషిస్తోంది. 

రాజ్యాంగం మన దేశంలో ఏకీకృత న్యాయవ్యవస్థను ఏర్పర్చింది. సుప్రీంకోర్టు,హైకోర్టులు ఒకే న్యాయ వ్యవస్థలో అంతర్భాగాలుగా ఉంటాయి.1773లో బ్రిటీష్ పార్లమెంట్​ రెగ్యులేటింగ్ చట్టాన్ని ఆమోదించడం ద్వారా భారతదేశంలో సుప్రీంకోర్టు స్థాపనకు మార్గం ఏర్పడింది. భారత రాజ్యాంగం 5వ భాగంలో 124వ అధికరణం నుంచి 147వ అధికరణాలలో సుప్రీంకోర్టు నిర్మాణం, విధుల గురించి పొందుపర్చారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉండేవారు. ప్రస్తుతం 33+1=34 మంది ఉన్నారు. 124(1) ఆర్టికల్​ సుప్రీంకోర్టు నిర్మాణాన్ని వివరిస్తుంది. 

సుప్రీంకోర్టు అధికారాలు & విధులు

ప్రాథమిక అధికార పరిధి:  సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధి 131వ రాజ్యాంగ ప్రకరణలో వివరించారు.
(1) భారత ప్రభుత్వానికి ఒకటి లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు మధ్య ఏర్పడిన వివాదం. 
(2) భారత ప్రభుత్వం ఒకటి అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఒకవైపు, ఇతర రాష్ట్రాలు మరోవైపున ఉండి వాటి వివాదం ఏర్పడినప్పుడు.
(3) రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడినప్పుడు.
సూక్ష్మంగా చెప్పాలంటే ఇవన్నీ సమాఖ్య విభాగాల మధ్యనున్న కలహాలు, ఇవి సుప్రీంకోర్టు ప్రాథమిక అధికారాల కిందికే వస్తాయి. 

అప్పీళ్ల విచారణ పరిధి: సుప్రీంకోర్టు అప్పీళ్లను విచారణచేసే అత్యున్నత న్యాయస్థానం. కింది కోర్టు ఇచ్చే తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి తగిన కొన్ని వివాదాలు మాత్రమే ఉంటాయి.అప్పీళ్లు కింది తరగతులుగా విభజించవచ్చు.

1. పౌర వివాదాలు 
2. క్రిమినల్ వివాదాలు
3. రాజ్యాంగపరమైన వివాదాలు
4. ప్రత్యేక సెలవు/అనుమతితో కూడిన వివాదాలు

సలహా అధికార పరిధి: రాజ్యాంగంలోని 143వ ప్రకరణ ప్రకారం సుప్రీంకోర్టు సలహా అధికార పరిధిని కలిగి ఉంటుంది. ప్రజా ప్రాముఖ్యం గలిగిన ఏ అంశం పైనగాని లేక ఏ చట్టంపైన గాని  అనుమానం ఉందని భారత రాష్ట్రపతి భావిస్తే అతడు దానిని సుప్రీంకోర్టు యొక్క అభిప్రాయం కొరకు పంపవచ్చు. 

కోర్ట్ ఆఫ్​ రికార్డు: 129వ ప్రకరణం ప్రకారం కోర్ట్ ఆఫ్ రికార్డ్ పని చేస్తుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్ సమర్పించిన సమాచారాన్ని అన్ని న్యాయస్థానాలు సాక్ష్యంగా పరిగణిస్తాయి. ఒకసారి కోర్టు రికార్డులోకి వెళ్లిన అంశం చట్టంతో సమానంగా గౌరవించబడి దాని ధిక్కరణ కోర్టు ధిక్కారం కింద పరిగణిస్తారు.

న్యాయసమీక్షాధికారం: రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న ఏ చట్టాన్నైనా, ఆర్డినెన్సునైనా, అధికార నిబంధననైనా చెల్లదని తీర్పునిచ్చే అధికారమే న్యాయ సమీక్ష....ఏ చట్టమైన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అది ఆచరణలో లేకుండా పోతుంది. సుప్రీంకోర్టు రాజ్యాంగ సంరక్షకుడుగా పనిచేస్తుంది.

రాజ్యాంగాన్ని వివరించే అధికారం: రాజ్యాంగ నిబంధనలకు అర్ధవివరణ చేసే అంతిమ అధికారం సుప్రీంకోర్టుదే. భారత రాజ్యాంగంలో ఉపయోగించిన పదజాలం, భావంపై అభిప్రాయం తెలపడానికి సుప్రీంకోర్టు మాత్రమే తగినది.

  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలపై సుప్రీంకోర్టు మాత్రమే నిర్ణయిస్తుంది. ఆ విషయంలో దానికే అధికారం ఉంటుంది.
  • రాష్ట్రపతి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రవర్తనపై విచారణ చేయమని సుప్రీంకోర్టును కోరగలరు. సుప్రీంకోర్టు వారి దుష్ప్రవర్తనను కనుగొన్నట్లయితే వారిని తొలగించమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు.
అధికార పరిధి విస్తరణ  : కేంద్ర జాబితాలోని అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు అధికార పరిధి ఒక పార్లమెంటరీ చట్టం ద్వారా విస్తరించవచ్చు. ప్రాథమిక హక్కుల అమలుతోపాటు ఇతర సందర్భాలలో సూచనలు చేయడానికి ఉత్తర్వులు, రిట్లను జారీ చేయడానికి కావలసిన అధికారాన్ని పార్లమెంట్​ సుప్రీంకోర్టుకు ఇస్తుంది.

న్యాయమూర్తుల అర్హతలు

  •   భారతీయ పౌరుడై ఉండాలి.
  •   5 సంవత్సరాల పాటు వరుసగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి లేదా హైకోర్టులో 10 సంవత్సరాలు న్యాయవాదిగా పని చేసి ఉండాలి.
  •   రాష్ట్రపతి దృష్టిలో న్యాయకోవిదుడై ఉండాలి.
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభిశంసన పద్దతి ద్వారా తొలగిస్తారు. వీరి పదవీవిరమణ వయసు 65 సంవత్సరాలు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రూ.2.80 లక్షలు,ఇతర న్యాయమూర్తులకు ఒక్కొక్కరికి నెలకు రూ. 2.50 లక్షలు భారత సంఘటిత నిధి నుంచి వేతనం చెల్లిస్తారు.

రిట్(ఆదేశాల) అధికారాలు

32వ ఆర్టికల్​ ప్రకారం సుప్రీంకోర్టును తన ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించిన విషయాలపై ప్రతి పౌరుడు కోరవచ్చు. సూచనలు ఇవ్వడానికి, ఆజ్ఞలు,రిట్లు/ఆదేశాలు జారీ చేయడానికి సుప్రీంకోర్టుకు అధికారం ఇవ్వబడింది. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారంటో, సెర్షియోరరీలు తదితర రిట్లు తగినరీతిలో కోర్టు చేత జారీచేయబడతాయి. సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కులను రక్షించేదిగా, హామీ ఇచ్చేదిగా రూపొందించారు.

1) భారత రాజ్యాంగంలోని న్యాయసమీక్ష దీనిపై ఆధారపడి ఉంటుంది? (A)

A) చట్టం నిర్దేశించిన పద్ధతి    
B) యథోచిత న్యాయ ప్రక్రియ
C) న్యాయాధిక్యం    
D) పూర్వవర్తి మరియు వాడుకలు.

2) రాష్ట్రాల మధ్య వివాదాలు సుప్రీంకోర్టు ఏ అధికార పరిధి కిందికి వస్తాయి? (B)

a) అప్పిలేట్ న్యాయ అధికార పరిధి
b) ప్రాథమిక అధికార పరిధి 
c) సలహా పూర్వక అధికార పరిధి 
d) రిట్ న్యాయ అధికార పరిధి

3) భారత రాజ్యాంగం దాన్ని అమలుపరిచే బాధ్యత దేనికి ప్రసాదించింది? (D)
A) అన్ని న్యాయస్థానాలు    B) రాష్ట్రపతి

C) పార్లమెంట్     D) సుప్రీంకోర్టు

4) ఒక అధికారిని చట్టరీత్యా తన విధులను నిర్వర్తించమని ఆదేశించే రిట్? (A)
A) మాండమస్    B) ప్రొహిబిషన్
C) కో -వారెంటో    D) హెబియస్ కార్పస్

5) సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమైన తొలి మహిళ?(A)

A) ఫాతిమా బీబి    B) జ్ఞాన్ సుధా మిశ్రా
C) సుజాతా మనోహర్     D) రుమా పాల్

బి.ఎన్. రావు, నాలెడ్జ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్, మిర్యాలగూడ