కునాల్‌ కమ్రా, రచిత తనేజాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు

కునాల్‌ కమ్రా, రచిత తనేజాలకు కోర్టు ధిక్కరణ నోటీసులు

సుప్రీం కోర్టును విమర్శిస్తూ ట్వీట్లు చేయడంపై కమెడియన్‌ కునాల్‌ కమ్రా, కార్టూనిస్ట్‌ రచిత తనేజాకు సుప్రీంకోర్టు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆరు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ వేర్వేరు కేసులలో స్పందించేందుకు వీరికి ఆరు వారాల సమయం ఇస్తూ..వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిచ్చింది. న్యాయవ్యవస్థను కించపరిచినందుకు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, ఆర్‌. సుభాష్‌ రెడ్డి, ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

ఓ ఆత్మహత్య కేసులో అరెస్టైన రిపబ్లిక్‌ టీవీ అధినేత అర్నబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని నిరసిస్తూ కునాల్‌ ట్వీట్లు చేశారు. దీంతో కునాల్‌ ట్వీట్లపై సుప్రీంకోర్టులో ఎనిమిది మంది పిటిషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా అర్నాబ్‌ గోస్వామికి బెయిల్‌ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుపై రచిత తనేజా ట్వీట్లు చేశారు. వీరిద్దరీ ట్వీట్లపై న్యాయ శాస్త్ర విద్యార్థి స్కంద్‌ బాజ్‌పారు..కోర్టు ఉల్లంఘన కేసు దాఖలు చేసేందుకు అనుమతినివ్వాలని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ను కోరారు. అయితే.. ఒక వ్యక్తిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటే అటార్నీ జనరల్‌ లేదా, సొలిసీటర్‌ అనుమతి పొందాల్సి ఉంటుంది. రుచిత తన ట్వీట్ల ద్వారా అనుచిత పదజాలం వాడారని ఆరోపిస్తూ ధిక్కార చర్యలు తీసుకునేందుకు అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ అంగీకారం తెలిపారు. సుప్రీం కోర్టును కించపరచడమే కాకుండా, దాడికి పాల్పడ్డారంటూ తెలిపారు.

అంతకముందు కునాల్‌ ట్వీట్లపై కూడా స్పందిస్తూ…ఆయన వ్యాఖ్యలు హద్దులు దాటయంటూ కోర్టు ధిక్కరణ చర్యలకు అంగీకారం తెలిపారు. దీంతో కోర్టు కునాల్‌, రచితలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.