ఆర్టికల్ 370 : కేంద్రానికి సుప్రీం నోటీసులు.. ఏచూరికి ఊరట

ఆర్టికల్ 370 : కేంద్రానికి సుప్రీం నోటీసులు.. ఏచూరికి ఊరట

ఆర్టికల్ 370, కశ్మీర్ లో పరిస్థితులపై దాఖలైన పిటిషన్లు ఇవాళ సుప్రీంకోర్టు ముందుకొచ్చాయి. ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటుచేశామని.. అక్టోబర్ మొదటి వారంలో వాటిపై విచారణ ప్రారంభం అవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి కేంద్రం, పిటిషననర్లకు నోటీసులు పంపించింది.

కశ్మీర్ లో సాధారణ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు ఎత్తివేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇంటర్నెట్ , ల్యాండ్ లైన్ ఫోన్, ఇతర కమ్యూనికేషన్ సేవల విషయంలో ఆంక్షలపై 7  రోజుల్లో స్పందించి నివేదిక ఇవ్వాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.

జమ్ము కశ్మీర్, అక్కడి పరిస్థితులపై చర్చలు జరిపేందుకు.. ఓ ప్రత్యేక ప్రతినిధి నియమించేందుకు కేంద్రం సుప్రీంకోర్టు అనుమతి కోరింది. ఐతే.. ఈ విన్నపాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

సీతారాం ఏచూరి కశ్మీర్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జమ్ముకశ్మీర్ కు వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సీపీఎం లీడర్, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్ తరిగామిని .. ఏచూరి కలుసుకునేందుకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పర్మిషన్ ఇచ్చారు. “ఓ పార్టీ జనరల్ సెక్రటరీ గా ఉన్న మీరు జమ్ముకశ్మీర్ కు వెళ్లేందుకు మేం అనుమతి ఇస్తాం. కానీ.. కోర్టుకు చెప్పిన చోటుకు తప్ప మరో ప్రాంతానికి గానీ, రాజకీయ పరమైన కార్యక్రమానికి గానీ వెళ్లకండి” అని న్యాయమూర్తి సూచించారు.

కశ్మీర్ లోని అనంతనాగ్ లో తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు మొహమ్మద్ అలీమ్ సయ్యద్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ పర్మిషన్ ఇచ్చింది. అతడికి పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది.

ఇటీవలే ప్రతిపక్ష నాయకులు కశ్మీర్ లోని శ్రీనగర్ కు వెళ్లినప్పుడు.. పోలీసులు ఎయిర్ పోర్టునుంచే వారిని ఢిల్లీకి తిరిగి పంపించారు. దీంతో.. కొందరు నాయకులు కశ్మీర్ పర్యటన కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.