రిజర్వేషన్లు రైలు భోగీ లాంటివి.. సీటు దొరికిన వాళ్లు మరొకరిని రానివ్వరు: సుప్రీం కోర్టు న్యాయమూర్తి

రిజర్వేషన్లు రైలు భోగీ లాంటివి.. సీటు దొరికిన వాళ్లు మరొకరిని రానివ్వరు: సుప్రీం కోర్టు న్యాయమూర్తి

రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓబీసీ రిజర్వేషన్లపై వాదనల సందర్భంగా  జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై జరిగిన వాదనల సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. సామాజికంగా, రాజకీయంగా వెనకబడిన వర్గాల (ఓబీసీ) రిజర్వేషన్ల గురించి సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకరనారాయణనన్ వాదిస్తున్న సందర్భంలో జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘రిజర్వేషన్లు రైలు భోగీ లాంటివి. సీట్లు దొరికించుకున్న వాళ్లు మరొకరిని రానివ్వరు’’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. మహారాష్ట్రలో రాజకీయంగా వెనకబడ్డారా లేదా నిర్ధారించకుండా బంతియా కమిషన్ ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చిందని అడ్వకేట్ శంకరనారాయణన్ వాదించారు. ఈ సందర్భంగా.. రైలు భోగీలో సీటు దొరికిన వారు మరొకరికి సీటు ఇవ్వడానికి ఇష్టపడరని, ఇండియాలో కూడా రిజర్వేషన్ సిస్టం ఇలాగే ఉందని అన్నారు. 

జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్ 24 నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మే 14 నుంచి జస్టిస్ గవాయ్ సీజీఐ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీ విరమణ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. 

మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు 2016-17  నుంచి ఇప్పటి వరకు జరగలేదు. కారణం ఓబీసీ కోటా రిజర్వేషన్లపై కేసు నడుస్తుండటమే. అయితే మహారాష్ట్రలో ఓబీసీ కోటాను 27 శాతం అమలు చేయాలని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కమిషన్ వేయాలని, రిజర్వన్ల కోటా 50 శాతం మించరాదని అప్పట్లో సుప్రీం కోర్టు ఆదేశించింది. 

దీంతో ప్రభుత్వం అమలు చేయాలనుకున్న 27 శాతం రిజర్వేషన్ల అంశం వాయిదా పడింది. ఓబీసీ కోటా అంశం తేలకపోవడంతో అప్పటి నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ వివాదంపై మంగళవారం (మే 6) విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.